Begin typing your search above and press return to search.

బాబును టచ్ చేసిన వైసీపీ...అసలు కధ ముందుంది...?

ఇపుడు బాబుని వైసీపీ టచ్ చేసింది. ఏకంగా నాలుగున్నరేళ్ళు అధికారంలో ఉన్న తరువాత ఆ ధైర్యం చేసింది.

By:  Tupaki Desk   |   9 Sep 2023 7:29 AM GMT
బాబును టచ్ చేసిన వైసీపీ...అసలు కధ ముందుంది...?
X

ఏపీలో చంద్రబాబు అరెస్ట్ సంచలనం రేకెత్తిస్తోంది. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయం కంటే పెద్దాయనను అరెస్ట్ చేశారు అన్న చర్చ ఎక్కువగా సాగుతోంది. చంద్రబాబుది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. ఆయన ఇప్పటిదాకా ఎపుడూ అరెస్ట్ కాలేదు. ఆయన మీద ఎన్నో కేసులు గతంలో పెట్టినా ఆయన కోర్టుకు వెళ్లకుండానే స్టేలు తెచ్చుకున్నారు.

ఆ తరువాత వాటి విచారణ ఏమైందో ఎవరికీ తెలియదు. జన సామాన్యంలో ఇవేమీ పట్టవు. బాబు అరెస్ట్ కాలేదు అంటే ఆయన గ్రేట్ అని మంచివారు అనుకునే వారే ఉంటారు. ఇక న్యాయపరమైన అంశాలు టెక్నికల్ రీజన్స్ వంటివి మేధావులకు మాత్రమే పట్టే విషయాలు. ఏది ఏమైనా చట్టం ముందు అందరూ సమానమే. అయితే దొరికే వరకూ మాత్రం అందరూ మంచివారే.

చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేస్తారు అని అంటారు. మరి ఎవరేమనుకున్నా బాబు అయితే అరెస్ట్ కాలేదు, కేసులు కూడా తన మీద లేవని ఆయన చెప్పుకుంటారు. దాన్నే జనాలు నమ్ముతారు కాబట్టి బాబు విషయం సామాన్య జనం కోణం నుంచి చూసినపుడు ఆయన ఆణిముత్యమే అంటారు. అయితే రాజకీయాల్లో అనేక వ్యూహాలు ఉంటాయి. అనేక రకాలైన పద్ధతులు ఉంటాయి.

రాజకీయం రొంపిలోకి దిగిన వారు ఎవరైనా సరే మంచి ఎక్కడుంది. ఎవరైనా ఇంతే అనుకునే వారూ ఉంటారు. ఏది ఏమైనా కూడా రాజకీయాలో నీతి అవినీతి మంచి చెడ్డా వీటిని గురించి సామాన్యులు చర్చించుకునే రోజులు ఉన్నాయా అంటే పోయాయి అనే చెబుతారు. ఏది ఏమైనా చంద్రబాబు విషయంలో ఆయన ఎపుడూ అంటూ ఉంటారు. తాను నిప్పు అని. తనను ఎవరూ ఏమీ చేయలేకపోయారు అని.

ఇపుడు బాబుని వైసీపీ టచ్ చేసింది. ఏకంగా నాలుగున్నరేళ్ళు అధికారంలో ఉన్న తరువాత ఆ ధైర్యం చేసింది. బాబుని టచ్ చేస్తే ఏమవుతుంది అన్నది ఎపుడూ పెద్ద ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే అది ఎపుడూ జరగలేదు కాబట్టి. మొత్తానికి వైసీపీ ఆ పని చేసింది. బాబుని అరెస్ట్ చేయడం కరెక్టేనా. అందులో ఎన్నికలు దగ్గరలో పెట్టుకుని అరెస్ట్ చేయడం సబబేనా. దీని వల్ల వచ్చే మైలేజ్ ఎవరికి. అసలు వైసీపీకి దీని వల్ల ఒరిగేదేంటి.

రాజకీయంగా లాభం అన్నది ఉంటుందా. ఉంటే ఎంత వరకూ అన్నది కీలకమైన చర్చగా సాగుతోంది. నిజానికి రాజకీయ లాభనష్టాలు చూసుకుంటే మేము బాబుని అరెస్ట్ చేసేవాళ్ళం కామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి అన్నారు. అంటే బాబు అరెస్ట్ వల్ల ఆయన అనుకూల మీడియా, ఆయన వైపు ఉన్న క్యాడర్ పార్టీ గగ్గోలు పెడుతుంది అన్నది తెలుసు. దీని వల్ల జన సామాన్యంలోకి అది పెద్ద ఎత్తున చర్చకు వెళ్తుందని. అలా వెల్లువెత్తే సానుభూతిని మొత్తం టీడీపీ క్యాష్ చేసుకుంటుంది అని తెలుసు అంటున్నారు.

మరి తెలిసి తెలిసి వైసీపీ ఈ విషయం ఎందుకు ఇంతదాకా తెచ్చింది అన్నదే ప్రశ్న. ఇక చంద్రబాబు ఇంట్లో ఉంటే అరెస్ట్ చేయడం వేరు. అది నాలుగు గోడల మధ్య జరిగిపోతుంది. కానీ చంద్రబాబు ప్రజలలో ఉన్నారు. ప్రజలతో తిరుగుతుననరు. సభలు పెడుతున్నారు. అలాంటి వ్యక్తిని జనంలోకి వెళ్లి మరీ అరెస్ట్ చేయడం వల్ల వైసీపీ వ్యూహాత్మకంగా తప్పు చేసిందా అన్న మరో చర్చకి తెర లేస్తోంది.

తిమ్మిని సైతం బమ్మిగా మార్చే నైపుణ్యం తెలుగుదేశం పార్టీకి ఉందని అంటారు. అలాంటి పార్టీని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పట్టుకుని అరెస్ట్ చేయడం ద్వారా వైసీపీ సాధించేది ఏమిటి అన్నది తెలియదు కానీ వైసీపీ అరెస్ట్ చేసిన తీరులో రాంగ్ స్ట్రాటజీ ఉందని అంటున్నారు. ఇక చంద్రబాబుని ఎన్నికల వేళ అరెస్ట్ చేయడం రాజకీయంగా వైసీపీకి నష్టం ఎంతో కొంత చేస్తుంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసులో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ దీనిని కనుక రుజువు చేయకపోతే భారీ మూల్యం వైసీపీ చెల్లించాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని అందుకే అరెస్ట్ చేశామని అంటున్నారు. మరి ఆ ఆధారాలు కనుక కరెక్ట్ గా కోర్టు ముందు పెట్టి బాబుని దోషిగా రుజువు చేయాల్సిన గురుతర బాధ్యత ఉంది. లేకపోతే ఇది కచ్చితంగా కక్ష సాధింపు చర్యగానే అంతా తీసుకుంటారు అని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ ఎక్కడ టచ్ చేయాలో అక్కడ చేసింది. వైసీపీ పొలిటికల్ డేరింగ్ స్టెప్ కి జోహార్లే కానీ ఇక ముందు ఉంది అసలు కధ అని అంటున్నారు అంతా.