చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా.. ఏం జరిగిందంటే!
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే
By: Tupaki Desk | 12 Oct 2023 6:34 AM GMTటీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రూ.371 కోట్ల మేరకు అవినీతికి పాల్పడ్డారంటూ.. ఏపీ సీఐడీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం, అరెస్టు, రిమాండ్ విషయం తెలిసిందే.
అయితే.. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ.. ఇప్పటికే ఒకసారి హైకోర్టును ఆశ్రయించా రు చంద్రబాబు. అయితే.. అప్పట్లో తనది 'డీమ్డ్ కస్టడీ'గా పరిగణించాలని ఆయన తన పిటిషన్‌లో అభ్యర్థించారు. కానీ, ఏపీ హైకోర్టు.. చంద్రబాబు కస్టడీని డీమ్డ్ కస్టడీగా చూడలేమని పేర్కొంటూ.. కొన్ని రోజుల కిందట ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో మరోసారి చంద్రబాబు సాంకేతిక సమస్యలను పరిహరించి మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై గురువారం ఉదయం కోర్టు ప్రారంభం అవుతూనే విచారణ చేపట్టింది. అయితే.. ఈ బెయిల్‌పై సీఐడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు స్పందించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు వీలుగా సీఐడీకి ఐదు రోజుల పాటు సమయం కేటాయిస్తూ.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 17కు వాయిదా వేసింది. దీంతో ఈ నెల 17 వరకు చంద్రబాబు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.