Begin typing your search above and press return to search.

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ వాయిదా!

అయితే, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును గతంలో ఆశ్రయించింది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 11:30 AM GMT
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ వాయిదా!
X

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాదాపు రెండు నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యంతో చంద్రబాబుకు బెయిల్ లభించింది. అయితే, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును గతంలో ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు 2 వారాలపాటు వాయిదా వేసింది.

చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. తమకు 3 వారాల గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, లూథ్రా అభ్యర్థన పై ఏపీ సిఐడి తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా గతంలో సమయం తీసుకున్నారని, ఇప్పుడు మరోసారి వాయిదా కోరుతున్నారని ఆయన వాదనలు వినిపించారు.

చంద్రబాబు తరఫున లాయర్లు కౌంటర్ దాఖలు చేశారని, వీలున్నంత త్వరగా ఈ కేసు విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనానికి రంజిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్ విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది. వాస్తవానికి ఈ పిటిషన్ విచారణను 2 వారాల తర్వాత లిస్ట్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. అయితే, ఏపీ సిఐడి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ విజ్ఞప్తిని పరిగణించి విచారణ తేదీని కూడా ఈ రోజే సుప్రీంకోర్టు ప్రకటించింది.

దీంతో, ఈ కేసులో మరోసారి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లయింది. ఓవైపు రా కదలిరా సభలతో మరోవైపు సీట్ల పంపకాల వ్యవహారం వ్యవహారాలతో చంద్రబాబు బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటువంటి కీలక సమయంలో ఈ పిటిషన్ పై విచారణ మరో రెండు వారాలపాటు వాయిదా పడడం చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులకు భారీ ఊరటనిచ్చినట్లయింది.