Begin typing your search above and press return to search.

శ్వేతపత్రాల వెనక భారీ వ్యూహం...వైసీపీ నేతలే టార్గెట్?

వాస్తవాలు జనాలకు అర్ధం కావాలని ఆయన అంటున్నారు. వాస్తవాలు జనాలకు తెలిస్తే వైసీపీ నేతల మీద విచారణ జరిపి యాక్షన్ కి దిగినా అది కక్ష సాధింపు చర్యల కిందకు రాదు అని బాబు మాస్టర్ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 July 2024 2:06 AM GMT
శ్వేతపత్రాల వెనక భారీ వ్యూహం...వైసీపీ నేతలే టార్గెట్?
X

ఏదో టైం పాస్ కి శ్వేతపత్రాలు చంద్రబాబు రిలీజ్ చేస్తున్నారు ముందు హామీల సంగతి చూడాలని మీడియా ముందుకు వచ్చి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు కానీ అవి టైం పాస్ కి కానే కావని అంటున్నారు. చంద్రబాబు ఎంతో స్టడీ చేస్తూ ఒక్కో కీలక రంగంలో శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారు. వాటిని కూడా మీడియాను పిలిచి మరీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు.

వాస్తవాలు జనాలకు అర్ధం కావాలని ఆయన అంటున్నారు. వాస్తవాలు జనాలకు తెలిస్తే వైసీపీ నేతల మీద విచారణ జరిపి యాక్షన్ కి దిగినా అది కక్ష సాధింపు చర్యల కిందకు రాదు అని బాబు మాస్టర్ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. పైగా వేల కోట్ల ధనం అందులో వృధా అవుతోందని ఆయన చెబుతున్నారు. అలాగే భూ కబ్జాలు సహజ వనరుల మీద దోపిడీ అంటూ బాబు తాజాగా విడుదల చేసిన మరో శ్వేతపత్రంలో కూడా అనేక అంశాలు ఉన్నాయి అంటున్నారు.

గనులు కరగించిన ఘనులకు అలాగే భూకబ్జాలకు కారణమైన వారు అలాగే ప్రకృతిని దొలిచేసి వారికి చట్ట ప్రకారం చర్యలు తప్పవని అంటున్నారు. దాంతో వైసీపీ నేతల గుండెలలో దడ మొదలైంది అని అంటున్నారు. గతంలో యధేచ్చగా ఈ రకమైన కార్యక్రమాలలో పాలు పంచుకున్న వారు అయితే సేఫ్ జోన్ కోసం చూస్తున్నారు అని అంటున్నారు.

అలాంటి వారు అంతా ఢిల్లీ వైపుగా క్యూ కడుతున్నారు అని అంటున్నారు. ఎటూ టీడీపీ కత్తికి కంకణం కట్టి తమ మీదకు దూసుకుని వస్తున్న నేపధ్యంలో అందులో చేరడం దుర్లభం అని తెలిసిన వారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే తమకు ఒక షెల్టర్ ఉంటుందని ఆశపడుతున్నారుట.

అయితే ఈ విషయంలో బీజేపీ పెద్దలు నేరుగా డెసిషన్ తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఏపీలో టీడీపీతో బీజేపీకి దోస్తీ ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అవసరం అయిన ఆక్సిజన్ ని టీడీపీ ఎంపీల రూపంలో అందిస్తున్నారు. దాంతో టీడీపీకి కోపం కలిగించే పనులను బీజేపీ ఈ సమయంలో చేయదు అని అంటున్నారు.

దాంతో పాటు ఏపీలో కలసి ప్రభుత్వం నడుపుతున్న నేపధ్యంలో అక్రమార్కులకు శిక్షలు పడకుండా వారికి కండువాలు కప్పితే అపుడు జనాలకు తప్పుడు సంకేతం వెళ్తుందని టీడీపీ పెద్దలు కూడా బీజేపీకి వివరిస్తారు అని అంటున్నారు. దాంతో అరెస్టులు ఇతరత్రా చర్యల నుంచి తప్పించుకోవడం ఎలా అన్న దాని మీద వైసీపీలో టార్గెట్ అవుతున్న వారు తర్జన భర్జన పడుతున్నారుట.

మరో వైపు చూస్తే టీడీపీతో పొత్తుని వ్యతిరేకిస్తున్న ఏపీ బీజేపీ వర్గం మాత్రం సొంతంగా బలపడేందుకు ఇది సరైన అవకాశం అని తమ పార్టీ పెద్దలకు చెబుతోందిట. వైసీపీ నుంచి బలమైన నాయకులు వస్తే ఆయా ప్రాంతాలలో పార్టీ బలపడుతుంది అని కూడా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారుట. మొత్తానికి ఏపీలో వైసీపీలో ఉంటే టార్గెట్ అవుతామని అనుకుంటున్న నేతలకు కూటమిలో మూడు పార్టీలు కనిపిస్తున్నా ఎవరి అండ దొరుకుతుందో అర్ధం కావడం లేదుట.

మరో వైపు చూస్తే వ్యవస్థలను విధ్వంసం చేసిన వారిని ఏపీ అభివృద్ధికి అడ్డుకట్ట వేసిన వారిని వదిలే సమస్యే లేదని తెలుగుదేశం నేతలు అంటున్నారు. దీంతో ఏమి జరుగుతుందో చూడాల్సిందే. టీడీపీని కాదని బీజేపీలో వైసీపీలో నేతలు చేరితే మాత్రం ఏపీ రాజకీయం రంజుగా మారే అవకాశం ఉంటుంది అని అంటున్నారు.