తొలి విడతలోనే మెప్పించాలి.. బాబు ముందు పెద్ద టాస్క్!
ఇక, రైల్వేజోన్.. పోలవరం నిధుల ఊసులేకుండానే నిర్మలమ్మ తన బడ్జెట్‌ను లాగించేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో మెజారిటీ నిధులను చంద్రబాబు రాబట్టుకోవాల్సి ఉంది.
By: Tupaki Desk | 4 July 2024 5:41 AM GMTటీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ముందు భారీ టాస్క్ ఉంది. ఇప్పుడు కనుక ఆయన ఏమాత్రం ఏమరు పాటుగా ఉన్నా.. మొహమాటానికి పోయినా.. ఇబ్బందులు తప్పవు. తొలి విడతలోనే సాధ్యమైనని నిధులు రాబట్టుకునేలా ఆయన కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను ఆయన కలుస్తారు. అయితే.. ఈ సందర్భంగా.. విరివిగా నిధులు కోరాల్సిన అవసరం ఉంది.
మరో 20 రోజుల్లోనే కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే ప్రతిపాదనలు రెడీ అయ్యారు. ఈ నేప థ్యంలో పోలవరం, అమరావతి, విశాఖ జోన్.. సహా ఇతర అవసరాలకు కూడా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేయించుకోవాల్సిన అవసరం చంద్రబాబుపై పడింది. గతంలో జగన్ కూడా.. బడ్జెట్ ప్రతిపాదనలకు ముందు ఢిల్లీకి వెళ్లినా.. ప్రయోజనం దక్కలేదు. చిత్రంగా గత బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.1000 కేటాయించారు. ఇది జగన్ సర్కారును నవ్వుల పాలు చేసింది.
ఇక, రైల్వేజోన్.. పోలవరం నిధుల ఊసులేకుండానే నిర్మలమ్మ తన బడ్జెట్‌ను లాగించేశారు. ఈ నేప థ్యంలో ఇప్పుడు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో మెజారిటీ నిధులను చంద్రబాబు రాబట్టుకోవాల్సి ఉంది. ఈ విషయంలో కొంత లౌక్యం కూడా ప్రదర్శించాల్సి ఉంది. కేవలం అప్పులు.. ప్రతిపాదనలకే పరిమితం కాకుండా.. రాజకీయంగా కూడా.. ఏపీలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమేనని కేంద్రానికి గుర్తు చేయాలి. తద్వారా.. వారి నుంచి భూరి నిధులు తెచ్చుకునేందుకు అవకాశం ఉంది.
ఇప్పుడే ఎందుకు?
ప్రస్తుతం ప్రవేశ పెడుతున్న బడ్జెట్లోనే ఏపీకి న్యాయం జరగాలి. ఎందుకంటే..దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. కేంద్రం ఇప్పుడు జోష్ మీదుంది. బాబు మద్దతుతో తాము అధికారంలోకి వచ్చామన్న కృతజ్ఞతా భావం చూపించే అవకాశం ఇప్పుడే ఉంటుంది. వచ్చే ఏడాదికి మిత్రులు ఎలా మారుతారో చెప్పలేని పరిస్థితి ఉంది. సో.. ఇది మంచి అవకాశం. రెండు.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. కేంద్రం నుంచి నిధులు భారీగా తెచ్చారన్న భావన కూడా ప్రజల్లో కలిగించాలి. దీంతో ప్రజల్లో బాబుపై మరింత ద్రుఢ విశ్వాసం పెరుగుతుంది. అందుకే చంద్రబాబు తన సర్వ శక్తులూ ఒడ్డాల్సిన తరుణం ఇదే!