Begin typing your search above and press return to search.

బీజేపీతో బాబు హ్యాట్రిక్ పొత్తు...సక్సెస్ సెంటిమెంట్ కోసం...!

పొత్తులలో ఇన్ని మలుపులు పిలుపులు విడాకులు ఉంటాయని ఇపుడే తెలిసింది అని ఏపీ జనం అనుకుంటే తప్పు లేదేమో

By:  Tupaki Desk   |   10 March 2024 2:45 AM GMT
బీజేపీతో బాబు  హ్యాట్రిక్ పొత్తు...సక్సెస్ సెంటిమెంట్ కోసం...!
X

పొత్తులలో ఇన్ని మలుపులు పిలుపులు విడాకులు ఉంటాయని ఇపుడే తెలిసింది అని ఏపీ జనం అనుకుంటే తప్పు లేదేమో. ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న తరువాత మళ్లీ వారితో ఉంటే కలసి వెళ్లాలి. లేకపోతే వదిలేయాలి. కానీ దశాబ్దానికి ఒక మారు పొత్తులు పెట్టుకోవడం మళ్లీ వదిలేయడం ఇలా ఏపీలో చూస్తే చంద్రబాబు బీజేపీల మధ్య సాగుతోంది.

తమాషా ఏంటి అంటే బీజేపీతో పొత్తు కోసం బాబే ఆరాటపడతారు వెళ్తారు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. పొత్తు రాష్ట్ర శ్రేయస్సు కోసం అని ఆర్భాటంగా ప్రకటిస్తారు. మళ్లీ ఆ పొత్తుని వద్దు అనుకునేది ఆయనే. ఏకపక్షమైన నిర్ణయం తీసుకునేది ఆయనే. ఇలా బాబు దాదాపుగా పాతికేళ్ల బట్టి ఈ పొత్తు విన్యాసాలు చేస్తూ వస్తున్నారు.

అవేంటో చూస్తే కనుక 1999లో చంద్రబాబు బీజేపీతో మొదటిసారి పొత్తు పెట్టుకున్నారు. అంతకు ముందు టీడీపీతో బీజేపీ పొత్తు ఉన్నా అది ఎన్టీఆర్ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో జరిగింది. బాబు టీడీపీ పగ్గాలు చేపట్టాక మాత్రం బీజేపీని నాలుగేళ్ల పాటు దూరంగానే ఉంచగలిగారు. ఆయన బీజేపీయేతర పాలిటిక్స్ నే నడిపారు.

కానీ 1999లో మాత్రం బీజేపీతో కలసి నడిచారు. అలా లోక్ సభ ఉమ్మడి ఏపీలో పొత్తు పెట్టుకుని వాజ్ పేయ్ అక్కడ ప్రధానిగా బాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2004లో కూడా ఈ రెండు పార్టీలూ ఎన్నికలకు వెళ్లాయి. కానీ ఆ ఎన్నికల్లో వాజ్ పేయ్ అక్కడ ఓటమి పాలు అయితే ఉమ్మడి ఏపీలో బాబు ఓడారు.

ఆ మీదట ఆయన ఇచ్చిన ప్రకటన ఏంటి అంటే మతతత్వ బీజేపీతో పొత్తు ఇక ఈ జన్మలో పెట్టుకోను అని. సరే 2009 నాటికి మహా కూటమి అని కూర్చి అందులో వామపక్షాలు నాటి టీఆర్ఎస్ ని కూడా చేర్చుకున్నారు కానీ బీజేపీని దూరం పెట్టారు. ఇలా గిర్రున పదేళ్ళ కాలం తిరిగింది, ఉమ్మడి ఏపీ రెండుగా చీలింది. విభజన ఏపీలో బీజేపీతో పొత్తు కోసం బాబు మరోసారి ప్రయత్నాలు చేశారు. అంటే 2004 నాటి మైత్రిని 2014లో పునరుద్ధరించుకున్నారు అన్న మాట.

అలా బీజేపీ బాబు కలసి విన్నింగ్ టీం అయింది. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. ఏపీలో బాబు వచ్చారు. అయితే ఈ పొత్తు నాలుగేళ్లకే తెగిపోయింది. అది కూడా బాబు వల్లనే 2018 మార్చిలో బీజేపీకి విడాకులు ఇచ్చి బాబు కాంగ్రెస్ వైపు మళ్లారు. 2019లో ఆయన బీజేపీకి వ్యతిరేకంగానే వెళ్లారు. ఫలితం మోడీ కేంద్రంలో గెలిచారు. బాబు ఏపీలో ఓడారు.

ఇక మరో అయిదేళ్ళు కాలం ముందుకు జరిగింది. 2024లో బాబు మళ్లీ బీజేపీతో పొత్తుని రిపీట్ చేశారు. ఈసారి పొత్తు చారిత్రాత్మకం అని అంటున్నారు. ఈ పొత్తులో చిత్రమేంటి అంటే 1999లో బీజేపీతో కలసి వెళ్ళిన బాబు గెలిచారు. అదే బీజేపీతో 2004లో వెళ్తే ఓడారు. ఇక 2014లో మళ్లీ గెలిచారు. 2024లో ఏమి అవుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఇలా హ్యాట్రిక్ పొత్తుకు బాబు తెర తీశారు.

ఈ సందర్భంగా శనివారం బాబు ఢిల్లీ నుంచి పార్టీ సీనియర్ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పొత్తులు అనివార్యం అన్నారు. అందుకే బీజేపీ పొత్తు అని చెప్పారు. ఈ పొత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసమని అన్నారు. సీట్లు రాని వారు బాధపడవద్దు నిరాశ చెందవద్దు అని చెబుతూ పొత్తు కుదిరింది అన్న దాన్ని అధికారికంగా చెప్పేశారు.

అదే విధంగా చూతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా టీడీపీ పొత్తుని ధృవీకరించారు. ఎన్డీయే కుటుంబంలో చేరాలన్న చంద్రబాబు పవన్ కల్యాణ్ ల నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు నడ్డా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, అద్భుత నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ముందుకెళతాయని తెలిపారు.

మూడు పార్టీలు దేశ ప్రగతికి కట్టుబడి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటు పడతాయని నడ్డా పేర్కొన్నారు. ఇలా పొత్తుల మీద టీడీపీ బీజేపీ రెండూ ప్రకటనలు చేశాయి. ముచ్చటగా మూడవసారి కుదిరిన ఈ పొత్తు ఫలితం ఏమిటి అన్నది వేచి చూడాల్సి ఉంది.