Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఆమెను ఎంపిక చేయడం కరెక్టే!

బైరెడ్డి శబరి.. ఇప్పుడు అంతా ఆమె గురించే చర్చ. ఒక్కసారిగా అందరి దృష్టిని ఆమె ఆకర్షించారు

By:  Tupaki Desk   |   3 July 2024 8:02 AM GMT
చంద్రబాబు ఆమెను ఎంపిక చేయడం కరెక్టే!
X

బైరెడ్డి శబరి.. ఇప్పుడు అంతా ఆమె గురించే చర్చ. ఒక్కసారిగా అందరి దృష్టిని ఆమె ఆకర్షించారు. కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ ఎంపీగా మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన శబరి తాజాగా లోక్‌ సభలో తన తొలి ప్రసంగంలోనే అదరగొట్టేశారని ప్రశంసలు అందుకుంటున్నారు.

తాజాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కళ్యాణ్‌ బెనర్జీ.. ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. ఈ సందర్భంగా అవినీతిపరులంతా కూటమి కట్టారని ప్రధానమంత్రి ఇండియా కూటమిని నిందించారని బెనర్జీ గుర్తు చేశారు. మరి.. చంద్రబాబు, అజిత్‌ పవార్, ప్రపుల్ల పటేల్‌ వంటివారిపై కేసులు ఇంకా పెండింగులోనే ఉన్నాయన్నారు. వీరంతా బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల సుద్దపూసలైపోయారా అని ప్రశ్నించారు.

చంద్రబాబును సీబీఐ, ఈడీ ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని కళ్యాణ్‌ బెనర్జీ నిలదీశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తో స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయిందని.. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి కంపెనీ మాత్రం రూ.521 కోట్లు లాభపడిందంటూ కళ్యాణ్‌ బెనర్జీ పార్లమెంటులో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆ తర్వాత టీడీపీ తరఫున నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ కళ్యాణ్‌ బెనర్జీని దునుమాడారు. ఆయన వ్యాఖ్యలను గట్టిగా ఖండించారు. ఇంగ్లిష్‌ లో మాట్లాడిన ఆమె తన తొలి ప్రసంగమైనప్పటికీ ఎక్కడా తొట్రుపాటు లేకుండా దంచేశారు. చంద్రబాబును సీబీఐ, ఈడీ ఎప్పుడూ అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. కళ్యాణ్‌ బెనర్జీ జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో, లేదో తనకు తెలియదంటూ ఎద్దేవా చేశారు.

నంద్యాలలోనే చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసిందన్నారు. దీనికి ప్రజలు మొన్నటి ఎన్నికల్లో విస్పష్టంగా తీర్పు ఇచ్చారని శబరి తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటుతో పాటు ఆ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసిందన్నారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్, వైసీపీలకు పెట్టనికోటగా ఉన్న నంద్యాల పార్లమెంటు, దాని పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుందన్నారు. దీంతో ఆమె పక్కనే ఉన్న టీడీపీ ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీ భరత్‌ గట్టిగా బల్లలు చరుస్తూ ఆమెకు మద్దతు పలికారు.

అలాగే గత వైసీపీ ప్రభుత్వ విధానాల కారణంగానే ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని బైరెడ్డి శబరి వెల్లడించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పుకునే ఆ పార్టీ పాలనలో యువత బిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. ఆకలితో శ్రామికులు, అప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో తన తొలి ప్రసంగంలోనే బైరెడ్డి శబరి అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె పార్లమెంటులో మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. టీడీపీ శ్రేణులతోపాటు నెటిజన్లు కూడా ఆమె వాగ్దాటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నంద్యాల ఎంపీగా గెలిచాక బైరెడ్డి శబరిని టీడీపీ అధినేత చంద్రబాబు లోక్‌ సభలో టీడీపీ పక్షం ఉప నేతగా నియమించారు. శబరి వైద్య విద్య చదువుకున్నారు. డాక్టర్‌ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు∙అంచనాలకు తగ్గట్టే శబరి తన తొలి ప్రసంగంలోనే అందరి దృష్టిని ఆకర్షించారు.

కాగా రాయలసీమలో పేరున్న నేతల్లో ఒకరయిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తే శబరి. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పెట్టింది పేరు అయిన నందికొట్కూరు నియోజకవర్గానికి చెందినవారు ఆయన.

1978, 1983, 1989ల్లో నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి తండ్రి, బైరెడ్డి శబరి తాత అయిన శేషయశయనారెడ్డి ఎన్నికయ్యారు. ఆయన తదనంతరం 1994, 1999ల్లో ఆయన కుమారుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి గౌరు చరిత చేతిలో బైరెడ్డి ఓడిపోయారు.

ఇక 2009లో అప్పటివరకు జనరల్‌ నియోజకవర్గంగా ఉన్న నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడుగా మారింది. దీంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి కర్నూలు జిల్లాలోని పాణ్యం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక ఉద్యమం జరుగుతున్నప్పుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి సైతం టీడీపీ నుంచి బయటకొచ్చి రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ప్రత్యేక ఉద్యమం నడిపారు.

రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో బైరెడ్డి కూడా రాయలసీమ స్థాయిలో కీలక నేతగా ఎదగడానికి ప్రయత్నించినా ఆ ప్రణాళిక వర్కవుట్‌ కాలేదు.

ఆ తర్వాత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ లోకి అక్కడి నుంచి స్వల్పకాలంలోనే మళ్లీ బీజేపీలోకి వెళ్లారు. బైరెడ్డి కుమార్తె శబరి బీజేపీలో చేరి యువమోర్చాలో కీలక పాత్ర పోషించారు.

2014లో బైరెడ్డి శబరి పాణ్యం నుంచి రాయలసీమ పరిరక్షణ సమితి గుర్తుపై పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమెకు కేవలం 5 వేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈ నేపథ్యంలో తన కుమార్తె భవిష్యత్తుపై పెద్ద ఆశలు పెట్టుకున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఈ సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. తన కుమార్తె శబరికి నంద్యాల పార్లమెంటు సీటు దక్కేలా చేశారు. వైసీపీ కంచుకోటలో తన తొలి ప్రయత్నంలోనే శబరి ఎంపీగా ఎన్నికయ్యారు.