Begin typing your search above and press return to search.

నో కాంప్రమైజ్...బాబు మార్క్ కేబినెట్

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో ఈసారి మంత్రివర్గాన్ని రూపకల్పన చేశారు

By:  Tupaki Desk   |   12 Jun 2024 8:15 AM GMT
నో కాంప్రమైజ్...బాబు మార్క్ కేబినెట్
X

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో ఈసారి మంత్రివర్గాన్ని రూపకల్పన చేశారు. నిజంగా బాబు చాలా లోతైన అధ్యయనం చేసి మరీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు అనిపిస్తుంది. ఈసారి బాబు ముందు అనేక సవాళ్ళు ఎదురైనా వాటిని అవలీలగా అధిగమించారు. మంత్రివర్గానికి ఫ్రెష్ లుక్ తెచ్చారు.

టీడీపీ నాలుగు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న పార్టీ. ఆ పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతీసారీ వారే మంత్రులు అవుతున్నారు. దాంతో ఇది రొటీన్ గా ఉంటోంది. జనాలకు కూడా టీడీపీ వస్తే వీరే మంత్రులు అన్న భావన ఏర్పడుతోంది.

కానీ దానికి భిన్నంగా ఈసారి బాబు మంత్రివర్గం కూర్పు సాగింది. చంద్రబాబు ఎంపికను చూసిన వారు ఆయన దూర దృష్టికి ఔరా అని అనాల్సిందే. రాయలసీమ నుంచి ముగ్గురు రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీకి బాగా పట్టున కర్నూలు జిల్లాకు ముగ్గురు మంత్రులను ఇచ్చారు. అలాగే కడప నుంచి కీలక మంత్రిగా మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిని తీసుకున్నారు.

అలాగే ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబానికి నెల్లూరు లో ఎంతో ప్రాధాన్యత ఉంది. దాంతో ఆయనను అక్కడ నుంచి తీసుకున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె నుంచి బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం కూడా బాబు చతురతకు నిదర్శనం అని చెప్పాల్సిందే.

ఇదే జిల్లా నుంచి ఎన్.ఎమ్.డి.ఫరూక్, టీజీ భరత్ లకు బాబు మంత్రి మండలిలో స్థానం కల్పించడం విశేషం. అలాగే రాయలసీమలోని మరో కీలకమైన జిల్లా అనంతపురం నుంచి ముగ్గురుకి మంత్రి మండలిలో బాబు చోటు కల్పించారు. అందులో చిరకాలంగా మంత్రి పదవి కోసం చూస్తున్న పయ్యావుల కేశవ్ ఒకరైతే బీసీల నుంచి ఇద్దరిని తీసుకున్నారు.

వారే బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్, అలాగే కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎస్.సవిత ఉన్నారు. దాంతో ఈ జిల్లాలో బీసీలను బాబు గౌరవించినట్లు అయింది. అలాగే కొత్త ముఖాలకు కూడా వీలు కల్పించినట్లు అయింది.

మరో వైపు చూస్తే క్రిష్ణా జిల్లా అంటేనే కమ్మలకు ప్రాధాన్యత ఇస్తారని పేరు. అలాంటి జిల్లాలో బాబు మార్క్ సోషల్ ఇంజనీరింగ్ బాగా సాగింది. ఇద్దరు మంత్రులను ఆయన ఎంపిక చేస్తే ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. సీనియర్ నేత కొలుసు పార్ధసారధి అదే విధంగా కొల్లు రవీంద్రలకు బాబు చోటు కల్పించారు. ప్రకాశం జిల్లా నుంచి గొట్టి పాటి రవికుమార్ వంటి బలమైన కమ్మ సామాజిక వర్గం నేతకు చాన్స్ ఇచ్చారు. అలాగే ఎస్సీ కోటాలో డోలా బాల వీరాంజనేయులుకు చాన్స్ ఇచ్చి కొత్త ముఖాలను పరిచయం చేశారు.

గుంటూరు జిల్లాలో బాబు సమతూకం పాటించారు. ఇక్కడ జనసేన కోటాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ కి అవకాశం ఇచ్చారు. బీసీ సామాజికవర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్ కి మంత్రిగా చాన్స్ ఇచ్చారు.

దాంతో ధూళిపాళ్ళ నరేంద్రకు అదే విధంగా కన్నా లక్ష్మీ నారాయణకు ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు వంటి వార్లకు అవకాశం దక్కలేదు. కానీ బాబు మాత్రం సామాజిక సమీకరణలకు కొత్త ముఖాలకు పెద్ద పీట వేశారు అని చెప్పాలి.

గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఇక్కడ కాపులకు ప్రాధాన్యత బాగా ఇచ్చారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ ఉంటే టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు ఉన్నారు. అలాగే శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి వాసంశెట్టి సుభాష్ ని తీసుకున్నారు. ఇలా బలమైన సామాజిక వర్గాలకు బాబు న్యాయం చేశారు.

ఉత్తరాంధ్రాకు వస్తే వెలమ ప్లస్ తూర్పు కాపు ప్లస్ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ ఎస్టీ ఎస్సీ వర్గాలు వైసీపీకి అండగా ఉంటున్నాయి. అలాగే తూర్పు కాపు సామాజిక వర్గం కూడా అండగా ఉంటోంది. దాంతో బాబు చాలా తెలివిగానే ఎంపిక చేశారు.

ఫలితంగా కొత్త ముఖాలైన గుమ్మడి సంధ్యారాణికి ఎస్టీ కోటాలో తూర్పు కాపుల నుంచి కొండపల్లి శ్రీనివాస్ కి ఎస్సీ కోటాలో విశాఖ జిల్లాకు చెందిన వంగలపూడి అనితకు పదవులు దక్కాయి. శ్రీకాకుళం నుంచి ఎలాంటి రెండో ఆలోచన చేయకుండా అచ్చెన్నాయుడుకి మంత్రి పదవి ఇవ్వడం అంటే దానిని పార్టీ పట్ల అచ్చెన్నకు ఉన్న విధేయత అలాగే జిల్లాలో ఆ కుటుంబానికి ఉన్న పట్టుగా చూడాల్సి ఉంది.

మొత్తం మీద చూస్తే బాబు మంత్రివర్గంలో ఎనిమిది మంది బీసీలు ఉన్నారు. అలాగే పదమూడు మంది ఓసీలు ఉన్నారు. నలుగురు కమ్మలు నలుగురు కాపులు ముగ్గురు రెడ్లు ఒక వైశ్య, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ ఉన్నారు. బాబు ఎంత ఎక్సర్ సైజ్ చేశారో తెలియదు కానీ ఎలాంటి మొహమాటం లేకుండా మంచి మంత్రి వర్గాన్నే అందించారు అని చెప్పాల్సి ఉంటుంది.