Begin typing your search above and press return to search.

బాబు కేసులన్నీ సీబీఐకి...?

కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ కంటే ముందుగానే ఏపీ ప్రభుత్వం తమ చేతులలో ఉన్న సీఐడీకి పెద్ద పని చెప్పింది. సీఐడీ బాబుని అరెస్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   14 Oct 2023 4:26 AM GMT
బాబు కేసులన్నీ సీబీఐకి...?
X

టీడీపీ అధినేత కేసులు అన్నీ సీబీఐకి వెళ్ళిపోతాయా. ఏమో ఏదైనా జరగవచ్చు. అసలు సీబీఐ బాబు కేసుల మీద ఎపుడో ఒక చూపు చూడాలని వైసీపీ చాలా కాలంగా అంటూ వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ కంటే ముందుగానే ఏపీ ప్రభుత్వం తమ చేతులలో ఉన్న సీఐడీకి పెద్ద పని చెప్పింది. సీఐడీ బాబుని అరెస్ట్ చేసింది. అది మామూలు అరెస్ట్ అని మొదట్లో అనుకున్నారు.

కానీ కానే కాదు ఏకంగా నెల రోజులకు పైగా బాబు కారాగార వాసం అనుభవిస్తున్నారు అంటే సీఐడీ పనితనం స్పష్టంగానే కనిపిస్తోంది. రెండేళ్ల పాటు శ్రమించి నాలుగు వేల పేజీల డాక్యుమెంట్లను రెడీ చేసి మరీ చివరాఖరులో చంద్రబాబును అరెస్ట్ చేసింది.

దాంతోనే బాబుకు బెయిల్ రావడం లేదు, ఉపశమనం కలగడంలేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే స్కిల్ స్కాం కేసులో బాబుని సీఐడీ అరెస్ట్ చేసింది. ఏపీకి సంబంధించిన మ్యాటరే సీఐడీ దర్యాప్తు చేస్తుంది. అయితే ఈ కేసు మూలాలు ఈ కేసులో చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు కాబట్టి కేసు పరిధి ఎక్కువ కాబట్టి సీబీఐకి అప్పగించడం సబబు అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద హై కోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ విచారణకు అప్పగిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం కోర్టుకు తెలియచేయడం విశేషం.

అంతే కాదు ఈ ఒక్క కేసే కాదు ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులను కూడా సీబీఐతో విచారణ జరిపించాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నామని ఆయన కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ విషయంలో కేంద్రానికి తాము విన్నవించుకుంటున్నామని కూడా అన్నారు. దాంతో సీబీఐ విచారణకు ఏపీ ప్రభుత్వం చాలా సుముఖంగా ఉందని అర్ధం అవుతోంది. పైగా ఎంత కట్టుబడి ఉందో అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశాక వేరే అనుమానాలు ఎందుకు ఉంటాయి.

మరో వైపు చూస్తే ఈ కేసులో సీబీఐ విచారణకు ప్రతివాదులకు ఉన్న అభ్యంతరాలు ఏంటో చూడాల్సి ఉంది. అందుకే ఏకంగా 44 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హై కోర్టు ఆదేశిస్తూ విచారణను మరో నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.ఇక్కడ చూస్తే కనుక ప్రతివాదుల స్పందన ఎలా ఉన్నా న్యూట్రల్ పిటిషనర్ గా రాష్ట్ర శ్రేయస్సు ప్రజా ఖజానా నుంచి 371 కోట్ల రూపాయల మొత్తం అవినీతి పాలు అయింది అన్న బాధతో ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసు వేశారు.

అసలు నిజాలు వెలికి రావాలని ఆయన కోరుకుంటూనే ఏపీ కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఈ కేసు మీద విచారణ జరగాలని, అది సీబీఐకే సాధ్యమని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఓకే అంటోంది. మరి ఈ విచారణ సందర్భంగా కోర్టు కనుక ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తే మాత్రం చాలా సంచలనమే అవుతుంది అని అంటున్నారు.

ఒకసారి సీబీఐ కనుక ఎంట్రీ ఇస్తే ఆ వెనకనే ఈడీ కూడా వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీబీఐ ఎంట్రీ ఈ టైం లో ఉంటుందా అన్నది ఒక చర్చగా ఉంది. ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వంటి కేసులు కూడా సీబీఐకే అప్పగించమని కోరుతున్న వేళ హై కోర్టు నుంచి వచ్చే తీర్పు ఎలా ఉంటుందో అన్న ఆలోచన అందరిలో ఉంది మరి. సీబీఐ కనుక ఈ కేసుని టేకప్ చేస్తే మాత్రం టీడీపీ నిండా కష్టాలలో కూరుకుని పోయినట్లే అంటున్నారు.