పదిలక్షల కోట్ల అప్పులు ప్లస్ లక్షా 17 వేల కోట్ల చెల్లింపులు !
ఏపీ ఆర్ధిక పరిస్థితిని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మారు తేటతెల్లం చేశారు.
By: Tupaki Desk | 6 Aug 2024 3:46 AM GMTఏపీ ఆర్ధిక పరిస్థితిని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మారు తేటతెల్లం చేశారు. ఏపీ ఆర్ధికంగా ఎంత ఇబ్బందుల్లో ఉందో ఆయన వారికి తెలియచేస్తూ ఏపీ పునర్ నిర్మాణం కోసం అంతా కష్టపడి పనిచేయాలని కోరారు.
ఏపీలో అప్పులు పది లక్షల కోట్ల రూపాయలు ఉంటే వివిధ రకాలైన ఖర్చులకు పెట్టిన బిల్లులు చెల్లించాల్సినవి ఒక లక్షా 17 వేల కోట్లు ఉన్నాయని వివరించారు. అంటే ఏకంగా 11 లక్షల కోట్ల మేర ఖజానాకు భారం ఉంది అని బాబు తెలియచేశారు అన్న మాట.
ఏపీలో ఆదాయం వచ్చే మార్గాలతో పాటు సంపద సృష్టించే విషయాలలో కలెక్టర్లు వినూత్న ఆలోచనలు చేయాలని చంద్రబాబు కోరారు. ఏపీలో సంపద బాగా పెరగాలని బాబు అన్నారు. అది జరిగితేనే తప్ప ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడదని ఆయన అన్నారు. సంపదను సృష్టించాలంటే ఏపీలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలని బాబు చెబుతూ ఈ విషయంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
కలెక్టర్లుగా పనిచేయడం ఒక అదృష్టం అని బాబు చెబుతూ ప్రతీ విషయాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. ఏపీలో ఉన్నన్ని భూ సమస్యలు ఎక్కడా లేవని వాటి విషయంలో కలెక్టర్లు పూర్తిగా దృష్టి పెట్టాలని బాబు పేర్కొన్నారు.
ఏపీకి సంబంధించి విజన్ 2047 పేరుతో ఒక డాక్యుమెంట్ ని తీసుకుని రాబోతున్నట్లు బాబు ప్రకటించారు. ఏపీ విజన డాక్యుమెంట్ ని అక్టోబర్ 2న గాంధీ జయంతి వేళ విడుదల చేస్తామని తెలిపారు. అలాగే ప్రతీ జిల్లాకు ఒక విజన్ డాక్యుమెంట్ ని తయారు చేయాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. అంతే కాకుండా వివిధ అంశాల మీద కూడా పాలసీలు తెస్తున్నామని బాబు అన్నారు.
దాదాపుగా 11 గంటల పాటు సుదీర్ఘంగా కలెక్టర్ల సమావేశం సాగడం ఒక రికార్డుగా ఉంది. అన్ని అంశాలు ఈ సమావేశంలో చర్చించారు. కలెక్టర్లు జిల్లా అభివృద్ధికి చొరవ తీసుకోవాలని నిర్ణయాలలో కీలకం కావాలని బాబు పిలుపు ఇచ్చారు ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఇదే తరహాలో సమావేశాలు ఉంటాయని ఆయన చెప్పారు. మొత్తానికి ఏపీకి ఉన్న అప్పులను ఆయన కలెక్టర్ల సదస్సులో మరోసారి వివరిస్తూ ఏపీ గత అయిదేళ్ళ వైసీపీ పాలనలో విభజన కంటే కూడా ఘోరంగా దెబ్బ తిందని చెప్పుకొచ్చారు.