Begin typing your search above and press return to search.

జగన్‌ విషయంలో చంద్రబాబు అసలు భయం అదేనా?

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి నెల గడిచిపోయింది.

By:  Tupaki Desk   |   8 July 2024 9:52 AM GMT
జగన్‌ విషయంలో చంద్రబాబు అసలు భయం అదేనా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి నెల గడిచిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే తన తొలి పర్యటనకు పోలవరం ప్రాజెక్టును ఎంపిక చేసుకున్నారు. అలాగే రెండో పర్యటనకు అమరావతి రాజధానిని ఎంపిక చేసుకున్నారు. రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు.

ఈ నేపథ్యంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వివిధ అంతర్జాతీయ సంస్థలను, విద్యా సంస్థలను ఆహ్వానించే పనిలో ఉన్నారు. వాస్తవానికి తాము అధికారంలో ఉన్న 2014–19 మధ్య వివిధ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి, తమ క్యాంపస్‌ లు ఏర్పాటు చేయడానికి వచ్చాయని.. అయితే వాటిని జగన్‌ ప్రభుత్వం తరిమేసిందని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.

తాజాగా హైదరాబాద్‌ లో పర్యటించిన చంద్రబాబు అక్కడ టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్‌ భవన్‌ కు వెళ్లారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సైకోనే కాదని.. భూతం కూడా ఉందని జగన్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తానన్నారు.

తాను పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను పెట్టుబడులు పెట్టాలని కోరుతుంటే.. ‘‘మీరు అలాగే అంటారు.. మీరు ఉన్నంతవరకు బాగానే ఉంటుంది. మీ మీద మాకు నమ్మకం ఉంది... మీకు ట్రాక్‌ రికార్డు ఉంది.. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. మళ్లీ ఎప్పుడయినా మీ ప్రజలు ఆలోచిస్తే.. ఆ భూతం మళ్లీ ముందుకు వస్తుంది ఏమో’’ అని అంటున్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తాను పెట్టుబడిదారులకు ఒకటే మాట చెప్పానన్నారు. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. రాజకీయాల్లోకి అర్హత లేని వ్యక్తులు వస్తే ఎలా ఉంటుందో తెలియడానికి గత ఐదేళ్ల పరిపాలనే నిదర్శనమని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రాజకీయాల్లో మంచివాళ్లు ఉంటే ఏం జరుగుతుందో నిరూపించే సమయం వచ్చిందన్నారు.

కాగా జగన్‌ ను భూతంగా చూపిస్తోంది నిజంగా పారిశ్రామికవేత్తలా లేక టీడీపీ అలా భావిస్తోందా అనే ప్రశ్న ఉదయిస్తోందని అంటున్నారు. జగన్‌ హయాంలో కమీషన్ల కోసం బెదిరించడంతో కంపెనీలు వెళ్లిపోయాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మళ్లీ ఐదేళ్ల తర్వాత జగన్‌ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమవుతుందో చెప్పడానికే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారా లేక నిజంగానే పెట్టుబడిదారులు జగన్‌ అనే భూతం ఉందనే వ్యాఖ్యలు చేశారా అనేదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.