మోడీని చూసి చంద్రబాబు ఏమన్నారంటే....!?
చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేశారు.
By: Tupaki Desk | 17 March 2024 2:41 PM GMTచిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ప్రపంచ నేత మోడీ భారత్ ని విశ్వానికే గురువుగా మారుస్తున్న గొప్ప నాయకుడు మోడీ అని కితాబు ఇచ్చారు. మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి ఎక్కడికో సాగిందని అన్నారు.
మోడీ వల్ల భారత్ అతి పెద్ద ఆర్ధిక శక్తిగా ఎదిగిందని అన్నారు. మోడీ అంటేనే ఆత్మ గౌరవం నిండా నింపుకున్న నాయకుడు అని అన్నారు. కరోనా వంటి పెను విపత్తు ప్రపంచాన్ని కుదిపేసిన రోజున దేశంలోని అందరి ప్రాణాలు కాపాడేందుకు వ్యాక్సిన్ ని తయారు చేయించిన వారు మోడీ అన్నారు. అదే వ్యాక్సిన్ ని పంపి వంద దేశాలలో ప్రజలను కాపాడారని అన్నారు.
దేశంలో పేదరికం లేకుండా చేయాలన్న తపనతో పనిచేస్తున్నారు మోడీ అని కీర్తించారు. మోడీ వెంట అంతా నడవాల్సిన సమయం ఉందని అన్నారు. మోడీ వంటి నాయకుడు దేశానికి సరైన సమయంలో వచ్చారని ఆయన నాయకత్వం ఈ దేశానికి అవసరం అన్నారు.
దేశాన్ని మోడీ పరుగులు పెట్టిస్తూంటే జగన్ ఏపీని సర్వనాశనం చేశారు అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాడారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేకపోయారని నిందించారు. ఏపీని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.
ఏపీని కాపాడుకోవడానికే బీజేపీ జనసేన టీడీపీ ఒక్కటిగా ముందుకు వచ్చాయని చంద్రబాబు అన్నారు. జగన్ అధికార దాహానికి ఆయన సొంత బాబాయ్ బలి అయ్యారని, జగన్ కి ఓటు వేయవద్దు అని చెల్లెళ్ళే చెబుతూంటే ఇంకా ప్రజలు ఓటు ఎందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే రాజ్యమేలుతున్నాయని అక్రమ కేసులు పెట్టి విపక్షాలను జగన్ హింసించారని బాబు ఫైర్ అయ్యారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న దుర్మార్గుడు జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీని జగన్ నుంచి రక్షించుకునేందుకే జెండాలు పక్కన పెట్టి మూడు పార్టీలు ఒక్కటి అయ్యాయని అన్నారు.
ఈ మూడు పార్టీల అజెండా ఒక్కటే అని అన్నారు. ఈ మూడు పార్టీలు కలసి ఏపీలో అధికారంలోకి రాబోతున్నాయని చంద్రబాబు చెప్పారు. జగన్ ని గద్దె దించడానికి సిద్ధమాని అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ఏపీ ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్తుని సమూలంగా మారుస్తుందని కొత్త ఏపీని అందిస్తుందని చంద్రబాబు చెప్పారు. మొత్తానికి మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ జగన్ ని పూర్తిగా ఎండగడుతూ బాబు స్పీచ్ ఒక లెవెల్ లో సాగింది.