Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో పుంజుకుంటాం: చంద్ర‌బాబు

తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని ఆ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.

By:  Tupaki Desk   |   7 July 2024 5:42 PM GMT
తెలంగాణ‌లో పుంజుకుంటాం:  చంద్ర‌బాబు
X

తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని ఆ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. తాజాగా ఆయన హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబును చూసి ప్రతి ఒక్కరు ఆనందంగా ఫీల్ అయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణలో కూడా పార్టీ పుంజుకునే దశలో ఉందని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎంతోమంది నాయకులకు కేంద్రంగా నిలిచిందని అన్నారు. గడిచిన 20 ఏళ్లలో పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంద‌న్్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని తెలిపారు. పార్టీలోకి ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్లారు అయినా పార్టీ పునాదులు మాత్రం బలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

భవిష్యత్తు మొత్తం కార్యకర్తలదేనిని ఈ విషయంలో అధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్న ఎన్టీ రామారావు పార్టీని బలోపేతం చేయటంతో పాటు నగరాన్ని కూడా అన్ని విధాలా అభివృద్ధి చేశారని చెప్పారు. ఆయ‌న‌ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మరింత పుంజుకుంటుందని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలని తాను ఆశించినట్టు చంద్రబాబు చెప్పారు.

ఒక ప్రాంతం వైపు మొగ్గుచూపితే మరో ప్రాంతం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో రెండు ప్రాంతాల ప్రయోజనాల కోసం ఆలోచించి పని చేసినటువంటి ఏకైక పార్టీగా తెలుగుదేశం నిలిచిందని వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్ళ వంటివని చంద్రబాబు తెలిపారు. తెలుగుజాతి ఐక్యంగా ఉండాలని, కలిసి మెలిసి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీని విశిష్ట స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నా మని తెలిపారు. తెలుగు జాతి ఉన్నంతవరకు పసుపు జెండా రెపరెపలాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా వాఖ్యానించారు. పార్టీలోని ప్రతి కార్యకర్త కృషిని తాను గుర్తిస్తానని, అందరికీ ప్రాధాన్యం ఉంటుందని చంద్ర‌బాబు చెప్పారు.