జగన్ ఉద్యోగులే రాళ్లు వేస్తున్నారు: చంద్రబాబు
విశాఖ జిల్లా గాజువాక సభలో తనపై రాళ్లు విసిరిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 14 April 2024 5:31 PM GMTవిశాఖ జిల్లా గాజువాక సభలో తనపై రాళ్లు విసిరిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజువాక సభ లో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వెనుక వైపుగా ఓ వ్యక్తి రెండు రాళ్లు రువ్వాడు. అయితే.. ఈ రాళ్లు సభ ప్రాంగణా నికి తగిలి కింద పడ్డాయి. అయితే.. ఈ ఘటనను రెండు మూడు నిమిషాల తర్వాత.. చంద్రబాబు గుర్తించారు. ఏం జరిగిందని ఆరా తీశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ ఉద్యోగులే ఈ రాళ్లు రువ్వుతున్నారని మండిపడ్డారు.
``రాష్ట్రం అధికారం చేపట్టిన సీఎం జగన్ యువతకు కొన్ని ఉద్యోగాలు ఇచ్చాడు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఉద్యోగాలు సంపాయించి న కొందరు.. రాష్ట్రంలో చెలరేగిపోతున్నారు. ఈ గంజాయి, బ్లేడు బ్యాచ్ ముఠాలే నాపై రాళ్లు రువ్వాయి. నిన్న గులకరాయి తగిలితేనే సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆపశోపాలు పడిపోతున్నారు. ఇప్పుడు నాపై విసిరిన రాయి ఎలా ఉందో చూడండి. ఇది తగిలి ఉంటే..ఏమయ్యేది? `` అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదీ.. జగన్ మోహన్‌రెడ్డి పరిపాలన.. ఇవీ.. యువతకు ఇచ్చిన ఉద్యోగాలు.. అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
తెనాలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై జరిగిన రాళ్ల దాడిని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ``పవన్ కల్యాణ్ ఈ రాష్ట్రం కోసం.. ఈ ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నాడు. ఆయనపైనా రాళ్లు వేస్తున్నారు. పట్టపగలే ఆయనపై దాడి చేశారు. చుట్టూ లైట్లు ఉండగానే నాపై రాళ్లు వేశారు. వీరికి బరితెగింపు పెరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తోందని.. తెలిసి వీరి ఆగడాలు పెచ్చుమీరాయి`` అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌ల అరాచకాలు పెరిగిపోయినా.. పోలీసులు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.