ఎన్నికల తర్వాత.. వైసీపీ జెండా పీకేయడమే
''నాలో ఉండేది రాయలసీమ రక్తమే. అందుకే ఈ ప్రాంతాన్ని రతనాల సీమ చేయడానికి ప్రయత్నించా.
By: Tupaki Desk | 27 Jan 2024 10:30 AM GMT''నాలో ఉండేది రాయలసీమ రక్తమే. అందుకే ఈ ప్రాంతాన్ని రతనాల సీమ చేయడానికి ప్రయత్నించా. 12500 కోట్ల రూపాయలు కేటాయించా. మరి సీఎం జగన్ ఈ ప్రాంతానికి ఏం చేశాడు`` అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో టీడీపీ రా.. కదలిరా! సభను నిర్వహించింది. ఎన్నికలకు ముందు సమర శంఖం పూరించడమే లక్ష్యంగా ఈ సభలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
పీలేరులో నిర్వహించిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ అధికార అహంకారాన్ని దించేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. 2019 ఎన్నికలలో ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కిన జగన్.. ప్రజలను అడ్డంగా మోసం చేశారని విమర్శించారు.
''నేను రాయలసీమ బిడ్డను, నాలో ఉన్నది రాయలసీమ రక్తం. సీమగ్రామాలను రతనాల సీమ చేయాలంటే ఏం చేయాలో ఆలోచన చేశాను. హంద్రీనివా ప్రాజెక్టుపై 4200 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. పీలేరు పుంగనూరులకు నీళ్లు రాలేదు. గాలేరు నగిరిపై 1550 కోట్లు మా హయాంలో వెచ్చించాం`` అని చంద్రబాబు వెల్లడించారు.
విశాఖలో వైసీపీ నిర్వహిస్తున్న ‘‘సిద్ధం’’ సభను ఇక్కడ ప్రస్తావిస్తూ.. అవినీతి డబ్బుతో ఎన్నికల సభల కోసం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సిద్ధమని పెడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్‌ను ఇంటికి పంపడానికి యువత, రైతులు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా జగన్‌ను గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల అనంతరం వైసీపీ జెండా పీకేయడం తప్పదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
''యుద్ధం ప్రారంభమైంది. యుద్ధానికి మేము సిద్ధం’’ అని చంద్రబాబు అన్నారు. కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి జనసేన, టీడీపీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరారు.