కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు బాబు కితాబు...ఎందుకంటే ?
విభజన తరువాత తెలంగాణలో వరుసగా మూడు సార్లు ఎన్నికలు జరిగితే ఇద్దరు ముఖ్యమంత్రులుగా వచ్చారు.
By: Tupaki Desk | 7 July 2024 11:43 AM GMTవిభజన తరువాత తెలంగాణలో వరుసగా మూడు సార్లు ఎన్నికలు జరిగితే ఇద్దరు ముఖ్యమంత్రులుగా వచ్చారు. తొలి దశాబ్దం పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలించగా ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలిస్తున్నారు. ఈ ఇద్దరితో పాటుగా గతంలో కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంలు అయ్యారు. వీరంతా తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి ఏపీని పాలించిన బాబు తర్వాత వచ్చిన వారు.
అయితే చంద్రబాబు 2004 మేలో అధికారం వదిలేశారు. ఇప్పటికి ఇరవై ఏళ్లు అయింది. బాబు ఆనాడు తెలంగాణాలో ప్రత్యేకించి హైదరాబాద్ లో ప్రారంభించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ ముఖ్యమంత్రులు అంతా కొనసాగించారు. దాంతో బాబు ఆనందం వర్ణనాతీతం గా ఉంది.
ఆయన తెలంగాణా తెలుగుదేశం పార్టీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ తన డెవలప్మెంట్ విజన్ ని కొనసాగించిన ముఖ్యమంత్రులు అందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణాలో తాను ప్రారంభించిన అనేక కార్యక్రమాలే ఈ రోజు రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టాయని ఆయన అన్నారు.
హైదరాబాద్ లో హై టెక్ సిటీని తాను చూసాను ఎంతో ఆనందం కలిగింది అని చంద్రబాబు చెప్పారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ చేసిన కృషి అన్నారు. ఏ రాజకీయ నేతకు అయినా ఏ పార్టీకి అయినా ఇదే తృప్తి అని అన్నారు. ఒక ఎయిర్ పోర్టు కానీ ఒక సైబారాబాద్ కానీ ఆ రోజు ఆలోచన చేశామని ఈ రోజు ఆ ఫలితాలు వస్తున్నాయని అన్నారు. నాలెడ్జ్ ఎకనామీగా హైదారాబాద్ దేశంలో పేరు గడించింది అంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన ఘనత అని చంద్రబాబు చెప్పారు.
నా తరువాత వచ్చిన ముఖ్యమంత్రులను అభినందిస్తున్నాను అని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అంతా ముందుకు తీసుకుని వెళ్లారు కానీ చెడగొట్టలేదని బాబు అన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాటు పాలిస్తే ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారని ఆయన గుర్తు చేసారు. ఆ తరువాత బీఆర్ఎస్ పాలన పదేళ్ళు సాగింది. వారు కూడా ప్రగతిని ఏమీ మార్చకుండానే ముందుకు సాగారని అన్నారు.
ఇపుడు చూస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుని పోతున్నారు అని చంద్రబాబు అన్నారు. ఇక తాను ఏపీకి ముఖ్యమంత్రిగా అయిన వెంటనే రేవంత్ రెడ్డికి లెటర్ రాశాను అని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించుకోవడానికి తానే వచ్చి కలుస్తాను అని చెప్పి చొరవ తీసుకున్నాను అని బాబు అన్నారు.
దానికి తెలంగాణా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అని అన్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని అన్నారు. తెలుగు జాతి రాష్ట్రాలుగా ప్రాంతాలుగా విడిపోయినా ఒక్కటిగానే ముందుకు సాగాలని బాబు ఆకాంక్షించారు. అంతా కలిసికట్టుగా ముందుకు సాగితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని బాబు అన్నారు.
మొత్తానికి చూస్తే చంద్రబాబు రాజకీయ పార్టీలను అన్నింటినీ ఆయా ముఖ్యమంత్రులను అభినందించారు. తాను కాకుండా తెలంగాణా కోసం పనిచేసిన వారి అందరి కృషి వల్లనే ఈ రోజున హైదరాబాద్ ఈ విధంగా ఉందని బాబు అన్నారు. ఇదే స్పూర్తి ఎల్లకాలం కొనసాగాలని ఆయన కోరుకున్నారు.