జగన్‌పై చంద్రబాబు ఫిర్యాదులు.. ఇప్పుడంత అవసరమేంటి?
గత జగన్ పాలనలో జరిగిన అక్రమాలు, అన్యాయాలను, దోపిడీని పూస గుచ్చినట్టు వివరించడం వంటివి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
By: Tupaki Desk | 17 July 2024 6:31 PM GMTటీడీపీ అధినేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు.. రాజకీయాల్లో హుందాగా ఉంటారు. ఈ విషయంలో ఎవరికీ డౌట్ లేదు. పైగా.. ఆయన దూరదృష్టితోనూ పనిచేస్తారన్న పేరు సంపాయించుకున్నారు. దీంతో ఆయన సాధారణంగా.. రాజకీయ వ్యవహారాల విషయంలో ఎవరికీ ఫిర్యాదులు చేయడం కానీ.. లేనిపోని విధంగా కక్షకట్టి రాజకీయాలు చేయడం కానీ.. ఇప్పటి వరకు అంటే.. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో కనిపించలేదు. ఏదైనా ఉంటే..ప్రజల మధ్యకు రావడం.. విమర్శించడం.. నిప్పులు చెరగడం వరకు మాత్రమే సరిపెడతారు. సీమ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసినా.. ఆయన ఎప్పుడూ వ్యక్తిగత కక్షలతోనూ రాజకీయాలు చేసింది లేదు.
అయితే.. ఇప్పుడు ఆయన పంథా మార్చుకున్నారా? లేక.. రాజకీయంగా దూకుడు చూపించాలని అనుకున్నారా? అనేది తెలియడం లేదు. కానీ, రాజకీయంగా మాత్రం ఆయన చర్చనీయాంశం అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై కేంద్రానికి ఫిర్యాదులు మోయడం.. గత జగన్ పాలనలో జరిగిన అక్రమాలు, అన్యాయాలను, దోపిడీని పూస గుచ్చినట్టు వివరించడం వంటివి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. చంద్రబాబు ఎప్పుడు అలా చేయలేదు కదా.. ఇప్పుడు ఎందుకిలా చేశారు? అనేది మేధావులను సైతం విస్మయానికి గురి చేస్తున్న అంశం.
నిజానికి తాను కేంద్రానికి ఫిర్యాదులు మోయబోనని.. అలాంటి సంస్కృతి తనకు లేదని చంద్రబాబు చెప్పుకొన్న గంటల వ్యవధిలోనే ఏపీలో వైసీపీ సర్కారు సాగించిన అక్రమాలపై ఆయన ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదులు చేశారు. దీనిని ఆయనే ధ్రువీకరించారు. ఈ మేరకు ఎక్స్‌లోనూ పోస్టు చేశారు. శ్వేతపత్రాల విషయాన్ని షాకు వివరించానని.. వైసీపీ దోపిడీని కూడా.. కళ్లకు కట్టినట్టు వివరించానని పేర్కొన్నారు. మరి ఇలా ఎందుకు చేశారు? అన్నది ప్రధాన ప్రశ్న. అయితే.. ఇక్క డచంద్రబాబు కంటే కూడా.. కేంద్రంలోని బీజేపీకి జగన్ ఎలాంటి నాయకుడో తెలియదా? ఆయన పాలన గురించి తెలియదా? అంటే.. అన్నీ తెలుసు.
అయినా.. కూడా.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. అలానే ఇప్పుడు మోడీ నేతృత్వంలో ని కేంద్ర సర్కారుకు రాజ్యసభలో బలం లేదు. కానీ, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ప్రవేశ పెట్టాలనే మోడీ ప్రభుత్వం ఆలోచన. ఇదే జరిగితే.. రాజ్యసభలో 11 మంది ఎంపీలున్న జగన్ అవసరం ఎంతో ఉంది., ఈ నేపథ్యంలో జగన్ విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. దీనిని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు.. జగన్‌విషయంలో కేంద్రం సానుభూతి చూపకుండా.. ఆయన విషయంలో ఎలాంటి రాజకీయ మిత్రత్వానికి పావులు కదపకుండా ముందుగానే ఇలా.. ఫిర్యాదుల ద్వారా జాగ్రత్తలు పడ్డారా? అనేది ఆసక్తిగా మారింది. మరి మోడీ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.