పెట్టుబడుల కాలం.. బాబు బ్రాండ్ రేటింగ్ ఎంత?
తాజాగా కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 7 Aug 2024 12:30 AM GMTరాష్ట్రంలో పెట్టుబడిల కాలం ప్రారంభం కానుంది. ప్రభుత్వం మారిన తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు చెన్నై, బెంగళూరు, తెలంగాణకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. అదేవిధంగా అమెరికాకు చెందిన ఒకరిద్దరు కూడా లోకేష్ ని కలిసి పెట్టుబడుల విషయంపై ఆరా తీశారు. అలాగే అమరావతికి సహకరిస్తామని కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ విషయంలో చంద్ర బాబు బ్రాండ్ పనిచేస్తుందని అందుకే పెట్టుబడులు పెట్టేందుకు ఇరుగుపొరుగు రాష్ట్రాలు సహా ఈ దేశాల నుంచి కూడా ప్రతిపాదనలు వస్తున్నాయని కూటమి పార్టీ నాయకులు భావిస్తున్నారు.
వాస్తవానికి ఏ పెట్టుబడి దారుడైనా స్థిరమైన ప్రభుత్వం, స్థిరమైన శాంతి భద్రతలు ఉండాలని కోరుకుం టారు. ఈ రకంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు హయంలో శాంతి భద్రతలకు ఇబ్బంది ఉండదని ఒక నమ్మకం అయితే ఉంది. ఇక స్థిరమైన ప్రభుత్వం విషయంలో వచ్చే నాలుగు సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఇక్కడ ప్రధానంగా పెట్టుబడిదారులకు సమస్యగా మారుతున్న విషయం ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సదుపాయాలు ఎలాంటి సౌకర్యాలు అందుతాయి అనేదే.
ఎందుకంటే పదేపదే చంద్రబాబు చెబుతున్న ఒక విషయం జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 'ఖజానా ఖాళీ' అయిందని దీంతో తమ పాలన ఇబ్బందికరంగా మారుతున్నదని సీఎం చంద్రబాబు ఒకటికి నాలుగు సార్లు చెబుతున్నారు. సహజంగానే ఒకసారి రెండుసార్లు అయితే పర్వాలేదు. పదేపదే అదే విషయాన్ని ప్రస్తావిస్తే.. జాతీయ స్థాయి మీడియాలో ఇది చర్చగా మారుతుంది. ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా జాతీయ మీడియా ఇదే రాసుకువచ్చింది.
తాజాగా కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పుకొచ్చారు. ఎంత పెద్ద అప్పు ఉన్న రాష్ట్రాల్లో సహజంగానే పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా వెనకడుగు వేస్తారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి తమకు బలమైన మద్దతు ఉంటుందా? మౌలిక సదుపాయాలు ఇటువంటివి కల్పించాలంటే ప్రభుత్వం సహకరిస్తుందా? అనే సందేహాలు ఉంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయాన్ని కొన్ని ప్రముఖ జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. పెట్టుబడులపై ప్రభావం చూపిస్తాయని కూడా స్పష్టం చేశాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఖజానా ఖాళీ ఉందని, ఆదాయం లేదని చెప్పుకోవడం ద్వారా ఆ రాష్ట్రాలు వెనుకబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీ కూడా అదే బాటలో పని చేస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా అమెరికాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం అద్భుతంగా ఉందని అన్నారు.
రైతు రుణమాఫీ సహా అనేక పథకాలు అమలు చేస్తున్నామని, డబ్బుకు వచ్చిన ఇబ్బంది లేదని చెప్పుకొ చ్చారు. కానీ వాస్తవం అందరికీ తెలిసిందే. అప్పులు చేస్తే తప్ప తెలంగాణలో కూడా పరిపాలన చేయలేని పరిస్థితి. వచ్చే ఏడు మాసాల కాలానికి 57 వేల కోట్లు అప్పు చేయాల్సి ఉంటుందని తాజాగా ప్రకటించిన బడ్జెట్ లోనే ప్రభుత్వం చెప్పింది. కానీ, పైకి మాత్రం అంతా బాగుందని చెప్పడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీకి వచ్చే సరికి మాత్రం నోరెత్తితే ఖజానా ఖాళీ అంటున్నారు. మరి ఇది.. ప్రతిపక్ష వైసిపిని మరింత డ్యామేజీ చేయాలన్న మ్యూహంలో.. లేక మరే కారణంతోనో చంద్రబాబు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిం దని చెప్పుకొస్తున్నారు. కానీ.. ఇది పెట్టుబడుల విషయంలో ప్రతికూల ఫలితాలను ఇస్తుందనేది జాతీయ మీడియా చెబుతున్న మాట.