కౌంటింగ్ స్ట్రాటజీలో బాబు బిజీ !
పోలింగ్ సరళిని బట్టి గెలుపు అంచనాలు వేసుకుంటున్న టీడీపీ కౌంటింగ్ అనే అతి ముఖ్య ఘట్టాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది.
By: Tupaki Desk | 30 May 2024 1:30 AM GMTపోలింగ్ స్ట్రాటజీ ని సమర్ధంగా అమలు చేసి వైసీపీ కంచుకోటలలోనే చుక్కలు చూపించిన తెలుగుదేశం ఇపుడు కౌంటింగ్ స్ట్రాటజీకి పదును పెడుతోంది. పోలింగ్ సరళిని బట్టి గెలుపు అంచనాలు వేసుకుంటున్న టీడీపీ కౌంటింగ్ అనే అతి ముఖ్య ఘట్టాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది.
మామూలుగా అయితే కౌంటింగ్ గురించి పార్టీలు ఆతృతతోనే ఉంటాయి తప్ప వ్యూహాలు పన్నే సీన్ పెద్దగా ఉండదు. కానీ ఇపుడు ఏపీలో పరిస్థితి వేరు. ఏ పార్టీకి అనుకూలంగా గాలి లేదు. దాంతో హోరా హోరీగా పోరు సాగింది. అంతే కాదు దాదాపుగా ముప్పయి దాకా అసెంబ్లీ సీట్లలో అతి తక్కువ ఓట్ల మెజారిటీతో విజేతలు బయటకు వస్తాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. దాంతో ప్రతీ ఒక్క ఓటునూ కీలకంగా తీసుకుని లెక్కించుకుంటూ పోవాల్సి ఉంది. అలాగే తమకు పడని ఓటు మీద అవతల పక్షం క్యాష్ చేసుకునే ఓటు మీద అవసరమైన సందర్భాలలో అభ్యంతరాలూ పెట్టాలి.
దీంతో పూర్తి స్థాయిలో టీడీపీ అప్రమత్తం అయింది. విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చీ రావడంతోనే సీరియస్ గా పనిలోకి దిగిపోయారు. రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలకు ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో ఆయన తాజాగా పార్టీలోని కీలక నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రధానంగా కౌంటింగ్ డే ప్లాన్‌పై నేతలతో ఆయన చర్చించడం జరిగిందని అంటున్నారు.
ఈసారి కౌంటింగ్ ని ఆషామాషీగా తీసుకోవద్దని ఆయన పదే పదే నాయకులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలకు సూచించినట్లుగా చెబుతున్నారు. అంతే కాదు కౌంటింగ్‌పై సీరియస్‌గా దృష్టిపెట్టాలని నేతల్ని చంద్రబాబు కోరారు.
ఇక కౌంటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఈ నెల 31న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజక వర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించడం కీలకమైన పరిణామం గా చూస్తున్నారు. అదే విధంగా అలాగే జూన్ 1న జోనల్ స్ధాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ రెండు కార్యక్రమాలు చాలా కీలకమని చంద్రబాబు భావిస్తున్నారు.
మరో వైపు చూస్తే పోస్టల్ బ్యాలెట్ విషయంలో నెలకొన్న భిన్నాభిప్రాయాలు, అంచనాల నేపథ్యంలో కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని గట్టిగానే బాబు నేతలకు సూచించారు. అదే విధంగా జూన్ 4న జరిగే కౌంటింగ్ రోజు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాలని టీడీపీ నిర్ణయించింది.
ఈ మేరకు ఈసీ, డీజీపీకి బాబు లేఖ రాయనున్నారు. రాష్ట్రంలో 175 సీట్లకు గానూ, 130 ఎన్నికల పరిశీలకులనే నియమించడం పట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని భోగట్టా. మొత్తం మీద చూస్తే ఈ నెల 30 నుంచి ఉండవల్లిలోని తన ఇంట్లోనే ఉంటూ కౌంటింగ్ ప్లాన్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది. దాంతో చావో రేవో అన్నట్లుగా సాగిన ఏపీ ఎన్నికల తుది ఘట్టానికి టీడీపీ సర్వం సమాయత్త మై పోయింది అని అంటున్నారు.