టఫ్ ఫైట్... కీలక నేతకు ఎంపీ టిక్కెట్ డిక్లేర్ చేసిన చంద్రబాబు..!
సంప్రదానికి బిన్నంగా చాలా ఏళ్ల తర్వాత.. టీడీపీ ఇక్కడి టికెట్‌ను బీసీకి కేటాయించింది.
By: Tupaki Desk | 2 Feb 2024 5:47 AM GMTఅనంతపురం జిల్లాలోని అనంతపురం పార్లమెంటు టికెట్ వ్యవహారం ఆసక్తిని రేపుతోంది. ఇటు ప్రతిపక్షాల కూటమి.. అటు అధికార పార్టీ వైసీపీ కూడా ఇక్కడ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశాయి. సంప్రదానికి బిన్నంగా చాలా ఏళ్ల తర్వాత.. టీడీపీ ఇక్కడి టికెట్‌ను బీసీకి కేటాయించింది. కొన్నాళ్ల కిందట ఇదే విషయాన్ని పార్టీ నిర్ధారించింది. టికెట్ ఆశించిన జేసీ దివాకర్ రెడ్డి తనయుడికి ప్రత్యామ్నాయం చూస్తామని.. కానీ, అనంతపురం పార్లమెంటు టికెట్‌ను మాత్రం బీసీకి ఇస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. అనుకున్నట్టుగానే ఇప్పుడు బీసీకి కేటాయిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా వెలుగు చూసిన టీడీపీ పార్లమెంటు అభ్యర్థుల జాబితా ప్రకారం.. అనంతపురం ఎంపీ టికెట్‌ను మాజీ మంత్రి రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులుకు కేటాయించారు. సౌమ్యుడిగా.. అందరినీ కలుపుకొని పోయే నాయకుడిగా పేరు తెచ్చుకు న్న కాల్వ.. బోయ(వాల్మీకి) సామాజిక వర్గానికిచెందిన నాయకుడు. బీసీ సామాజిక వర్గం కిందకే వస్తారు. ఈయనను చంద్రబాబు ఇక్కడ నియమించనున్నారని సమాచారం. మరోవైపు.. వైసీపీ అనంతపురం ఎంపీ టికెట్‌ను ఈ దఫా కురబ సామాజిక వర్గానికి చెందిన పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణకు కేటాయించింది.
సో.. మొత్తానికి అటు వైసీపీ, ఇటు టీడీపీలు రెండు పార్టీలు కూడా.. అనంతపురం నియోజకవర్గాన్ని బీసీలకే కేటాయించారు. ఇక, కాల్వను తీసుకుంటే.. నియోజకవర్గం ఆయనకు కొత్తకాదు. 1999లో ఒకసారి విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన వరుసగా ఇక్కడ పోటీ చేశారు. 2004, 2009 ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా ఇక్కడ పోటీ ఇచ్చారు. అయితే.. రెండో స్థానంలో నిలిచారు. ఆ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేత అనంతవెంకట రామిరెడ్డి విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. 2014లో ఇక్కడ జేసీ ప్రభాకర్‌రెడ్డికి చంద్రబాబు చాన్స్ ఇవ్వగా ఆయన విజయం దక్కించుకున్నారు. 2019లో మాత్రం వైసీపీ విజయం దక్కించుకుంది.
సో.. సుదీర్ఘంగా.. పదేళ్ల విరామం తర్వాత.. కాల్వ మరోసారి అనంతపురం ఎంపీగా పోటీ చేయనుండడం గమనార్హం. నియోజకవర్గంపై పట్టు ఉండడం.. అందరికీ తెలిసిన నాయకుడు, పైగా బీసీ సామాజికవ ర్గంలోనూ ఆయనకు పరపతి పెరగడం నేపథ్యంలో మరోసారి ఆయన బలమైన నాయకుడిగా ఇక్కడ పోటీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఇటు వైసీపీ కూడా కురబ సామాజిక వర్గానికి ఇచ్చిన నేపథ్యంలో పోటీ టఫ్ అయితే.. ఉంటుందని.. గెలుపు ఎలా ఉంటుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని చెబుతున్నారు.