Begin typing your search above and press return to search.

ఢిల్లీలో బాబుకు ఇల్లు...పెద్ద పని పడినట్లే !

ఇపుడు మళ్ళీ బాబు జమానా వచ్చింది. ఆయన ఢిల్లీలో ఈసారి తన ఇంటి లోకి అడుగుపెట్టారు. ఈసారి పెద్ద పని ఉండటం వల్లనే బాబు ఢిల్లీలో నివాసాన్ని ఉంచుకున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2024 3:15 AM GMT
ఢిల్లీలో బాబుకు ఇల్లు...పెద్ద పని పడినట్లే !
X

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోని తనకు కేటాయించిన ఇంటిలో తాజాగా గృహ ప్రవేశం చేశారు. పూజలు సంప్రదాయం ప్రకారం నిర్వహించి కొత్తింట అడుగు పెట్టారు. ముఖ్యమంత్రులకు ఢిల్లీలో నివాసాన్ని కేంద్రం ఇస్తుంది. అయితే చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో తనకు ఇచ్చిన ఆ నివాసాన్ని ఉపయోగించుకోలేదు.

ఆయన ఎంపీల ఇళ్లలోనే వసతిగా చేసుకుని ఢిల్లీలో ఉండేవారు. ఆయన తరువాత సీఎం అయిన జగన్ మాత్రం ఢిల్లీలో తనకు కేటాయించిన నివాసంలోనే గడిపారు. ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడల్లా దానిని ఉపయోగించుకునేవారు.

ఇపుడు మళ్ళీ బాబు జమానా వచ్చింది. ఆయన ఢిల్లీలో ఈసారి తన ఇంటి లోకి అడుగుపెట్టారు. ఈసారి పెద్ద పని ఉండటం వల్లనే బాబు ఢిల్లీలో నివాసాన్ని ఉంచుకున్నారు అని అంటున్నారు. ఈసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి టీడీపీ మద్దతు కీలకంగా ఉంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అస్థిరత్వం మీద విపక్షం విమర్శలు చేస్తోంది.

ఇంకో వైపు జాతీయ స్థాయిలో రాజకీయ గాలి మారుతోంది.తాజాగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి తన సత్తా చాటింది. దీంతో జాతీయ స్థాయిలో టీడీపీ పాత్ర అత్యంత కీలకంగా మారబోతోంది అని అంటున్నారు. బాబుకు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన అనుభవం ఉంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో బాబుకు మంచి సంబంధాలే ఉన్నాయని అంటున్నారు.

ఈ రకమైన పరిణామాల మధ్య బాబు ఢిల్లీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు అని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. దాంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేందుకు బాబు తరచుగా ఢిల్లీ రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఇప్పటిదాకా బాబు ఢిల్లీకి వచ్చినా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసంలోనే బస చేసేవారు. ఇపుడు ఆయనకంటూ ఒక నివాసం ఉంది కాబట్టి ఆయన ఎపుడు వచ్చినా వెళ్ళినా ఇబ్బంది లేదు అని అంటున్నారు. దాంతో బాబు ఇక ఢిల్లీ టూ ఏపీకి షటిల్ సర్వీస్ చేస్తారు అని కూడా అంటున్నారు. ఆయన సీఎం గా బాధ్యతలు స్వీకరించాక ఇప్పటికి రెండు సార్లు ఢిల్లీకి వచ్చారు.

కేంద్ర మంత్రులను ఆయన కలుస్తున్నారు. రానున్న రోజులలో కూడా బాబు ఢిల్లీ పర్యటనలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు కేంద్రంతో తరచూ చర్చలు జరపడం ద్వారా వీలైనంత సయోధ్యను నిర్వహిస్తూ ఏపీకి దండీగా నిధులను తెచ్చుకోవాలని చూస్తున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో విపక్ష శిబిరాన్ని ఆయన ఒక కంట కనిపెడుతున్నారు. ఏపీలో వైసీపీని దూరంగా ఉండేలా చూస్తున్నారు.