Begin typing your search above and press return to search.

చెప్పినట్లే.. సీఎం చంద్రబాబు స్వయంగా ఇంటికెళ్లి పింఛన్ అందజేశారు

దీనికి వేదికగా మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా షురూ అయ్యింది.

By:  Tupaki Desk   |   1 July 2024 4:39 AM GMT
చెప్పినట్లే.. సీఎం చంద్రబాబు స్వయంగా ఇంటికెళ్లి పింఛన్ అందజేశారు
X

మాట అంటే మాట. చెప్పింది చెప్పినట్లు చేసినా.. దాని ప్రచారంలో జరిగిన తప్పుల్ని రిపీట్ కాకుడన్న జాగ్రత్తల్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకుంటున్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వేళలో.. ఎన్నికల హామీల్ని పక్కాగా అమలు చేసినప్పటికీ.. వాటి విషయంలో అవసరమైనంత ప్రచారం జరగకపోవటం.. విశ్వసనీయత లేని ముఖ్యమంత్రిగా.. చెప్పింది చెప్పినట్లు చేసే విషయంలో చంద్రబాబు వెనుకబడి ఉంటారన్న ప్రచారం జరిగింది. దీనికి ఈసారి చెక్ పెట్టేయాలన్న తలంపుతో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. ఎన్నికల వేళలో హామీ ఇచ్చినట్లుగా.. గత ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లకు బదులుగా భారీగా పెంచేసి ఒక్కో లబ్థిదారుకు రూ.7వేలు చొప్పున ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పంపిణీ చేస్తామన్న హామీని జూన్ 30 నుంచి షురూ చేశారు.

దీనికి వేదికగా మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా షురూ అయ్యింది. మంత్రి లోకేశ్.. ఇతర అధికారులతో కలిసి పెనుమాకకు వెళ్లిన ఆయన.. లబ్థిదారు ఇంటికి స్వయంగా వెళ్లి తమ ప్రభుత్వం పెంచిన పింఛన్ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లబ్థిదారు ఇంటి సభ్యులతో మాట్లాడారు. ఇంతకాలం పింఛన్ రూ.3వేలు చొప్పున అందుతుండగా.. చంద్రబాబు ఈ మొత్తాన్ని ఏకంగా వెయ్యి రూపాయిలు పెంచేసి రూ.4వేలు చేశారు. అంతేకాదు.. పెంచిన పింఛన్ మొత్తాన్ని ఏప్రిల్ తో మొదలు పెట్టి.. మిగిలిన మూడు వేలను అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.

అందుకు తగ్గట్లే.. ఏప్రిల్.. మే.. జూన్ కలిపి మూడు వేల రూపాయిలు.. మొత్తంగా రూ.7వేలను లబ్థిదారుకు అందజేశారు. గతానికి భిన్నంగా పింఛన్ల పంపిణీ విషయంలో ఎలాంటి తప్పులు జరగకూడదని.. మొదటి రోజే 100 శాతం పంపిణీ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ పంపిణీ బాధ్యతను సచివాలయ ఉద్యోగికి అప్పజెప్పారు. ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి 50 మంది పింఛన్ దారుల్ని కేటాయించారు.

అంతకంటే ఎక్కువ మంది ఉంటే.. కొన్నిచోట్ల అంగన్ వాడీ.. ఆశా సిబ్బందిని వినియోగించారు.ఏదైనా కారణంతో మొదటి రోజున పింఛన్ అందని వారికి రెండో రోజు అందేలా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65.18 లక్షల మంది లబ్థిదారుల పింఛన్ల కోసం రూ.4408 కోట్ల మొత్తాన్ని విడుదల చేశారు. గత ముఖ్యమంత్రి ప్రతి నెల పింఛన్ విడుదల కోసం ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టి బటన్ నొక్కేవారు. ఇందుకు భిన్నంగా ఈ ప్రోగ్రాం ప్రారంభాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్థిదారుల ఇంటికి వెళ్లి.. వారి బాగోగుల గురించి ఆరా తీసి మరీ.. పింఛన్ మొత్తాన్ని అందజేశారు. దీంతో.. తాను చెప్పిన మాట మీద నిలిచే వ్యక్తినని.. ఎన్నికల హామీల్ని చెప్పినట్లే అమలు చేస్తానన్న సరికొత్త భరోసాను అందరి మదిలో రిజిస్టర్ అయ్యేలా చేశారని చెప్పాలి.