జగన్ కి చాన్స్ ఇవ్వనంటున్న బాబు!
ఈ విధంగా వాలంటీర్ల వ్యవస్థను మరింత పకడ్బందీగా కొనసాగించడం ద్వారా జగన్ కి షాక్ ఇవ్వబోతున్నారు ఇక పెన్షన్ విషయంలోనూ చంద్రబాబు నాలుగు ఆకులు ఎక్కువ చదివారు.
By: Tupaki Desk | 13 Jun 2024 5:37 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు విశేష అనుభవం ఉన్న రాజకీయ నేత. రాజకీయాల్లో పొరపాట్లు జరుగుతూంటాయి. వాటి నుంచి ఆ వెంటనే గుణపాఠాలు నేర్చుకున్న వారు కొందరు మాత్రమే. చంద్రబాబు అయితే నిత్య విద్యార్ధి అని చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఏ మాత్రం భేషజాలకు పోరు. ప్రజలకు మేలు చేస్తుంది అనుకుంటే ప్రత్యర్థి పార్టీ పధకం అయినా అక్కున చేర్చుకుని తనదైన స్టైల్ లో దానికి మెరుగులు దిద్దుతారు.
ఇపుడు ఏపీలో చంద్రబాబు పూర్తిగా మారిన మనిషి అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. ఆయన ఎన్నికల్లో చాలా మెట్లు దిగి వచ్చిన దగ్గర నుంచి పొత్తుల విషయంలో రాజీ పడిన నేపధ్యం నుంచి ఆఖరుకు మంత్రి వర్గం కూర్పు విషయంలో బాగా తగ్గిన దానిని చూస్తే ఇలా ఒకటేంటి బాబు ఇంతలా మారిపోయారా అని అనిపించక మానదు.
చంద్రబాబు డెబ్బై అయిదేళ్ళ వయసులో తనను తాను మార్చుకున్నారు. ఆయన తన కంటే జూనియర్లతో పొలిటికల్ గా ట్రావెల్ చేస్తున్నారు అలాగే వైసీపీ ప్రవేశపెట్టిన స్కీములలో మంచివి ఉంటే వాటిని ఇంకా గొప్పగా తీర్చిదిద్దడానికి చూస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పారు.
ఇపుడు దానిని సాకారం చేయబోతున్నారు. ఆ విషయాన్ని ఆయన కేబినెట్ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది. అంతే కాదు ప్రతీ ఇంటికీ వెళ్ళి అవ్వాతాతలకు పెన్షన్లు ఇస్తుంది అని స్పష్టం చేశారు. వాలంటీర్లు ఎక్కడైనా రాజీనామా చేస్తే ఆ ఖాళీలలో కొత్త వారిని తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఈ విధంగా వాలంటీర్ల వ్యవస్థను మరింత పకడ్బందీగా కొనసాగించడం ద్వారా జగన్ కి షాక్ ఇవ్వబోతున్నారు ఇక పెన్షన్ విషయంలోనూ చంద్రబాబు నాలుగు ఆకులు ఎక్కువ చదివారు. నాలుగు వేల పెన్షన్ అని ఎన్నికల హామీగా ఇచ్చారు. అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తున్నామని చెప్పారు. దానికి తగినట్లుగా బాబు తన మొదటి అయిదు సంతకాలలో పెన్షన్ పెంపు మీద సంతకాన్ని పెట్టారు.
దాంతో జూలై నెలలో సామాజిక పెన్షన్లు ఏడు వేల రూపాయలు ప్రతీ అవ్వా తాతకు దక్కుతాయి. అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అందుతుంది. మొత్తానికి బాబు ఇలా సీటు ఎక్కిన రోజే తన హామీలను వరసబెట్టి నిలబెట్టుకోవడం చూస్తే ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పుని ఆయన ఎక్కడా వమ్ము పోనీయకూడదు అని నిర్ణయించుకున్నారు అని అర్ధం అవుతోంది.
టీడీపీ కూటమి తప్పులు చేస్తే దానికి సోపానాలుగా మార్చుకుని అధికారంలోకి రావాలని చూస్తున్న జగన్ ఎక్కడా చాన్స్ ఇవ్వకూడని బాబు తపన పడుతున్నారు. తొలి రోజు నుంచే దానికి శ్రీకారం చుట్టారు. జగన్ అయిదేళ్ల పాటు అప్పులు చేసి పధకాలు ఇచ్చారు. బాబుకు ఇపుడు కేంద్రం అండ ఉంది. దాంతో పాటు ఆయనకు అపారమైన అనుభవం తెలివి తేటలు ఉన్నాయి.
దాంతో బాబు తలచుకోవాలే కానీ ఏ ఒక్క హామీని వదలకుండా చేయగలరు అని అంటున్నారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మీద బాబు సంతకం కూడా పేదలకు సంతోషం కలిగించేదే. అలాగే మెగా డీఎస్సీ పేరుతో పదహారు వేల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ యువత మన్ననలు అందుకుంటున్నారు.
సంక్షేమంలో తన మార్క్ కనబడాలని బాబు తపిస్తున్నారు. ఇక అభివృద్ధికి ఎలాగూ బాబు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి బాబు అయిదేళ్ళ పాలన బ్రహ్మాండంగా సాగుతుందని తొలి అడుగులే నిరూపిస్తున్నాయి. అదే జరిగితే 2029 లో బాబు మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అని అంటున్నారు. మొత్తానికి జనాలను సరిగ్గా చదవడం బాబుకే సాధ్యమని అలాగే ప్రత్యర్ధులను అదను చూసి దెబ్బ కొట్టే రాజకీయ వ్యూహాలు ఆయన సొంతమని అంటున్నారు. బాబు ఏడున్నర పదుల వయసులో పదునైన ప్రణాళికలతో సాగుతున్న వైనం చూస్తున్న వారు బాబు ఇదే తీరున సాగితే ఆయన జీవితకాలం సీఎం గానే ఉంటారు అని అంటున్నారు.