చంద్రబాబు ఎఫెక్ట్: ఆ షేర్లు దూసుకుపోతున్నాయి
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలి రెండు రోజులు చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థల షేర్లు పుంజుకున్నాయి
By: Tupaki Desk | 19 Jun 2024 3:30 PM GMTఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలి రెండు రోజులు చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థల షేర్లు పుంజుకున్నాయి. కానీ, తర్వాత మందగమనంలో నడిచాయి. అయితే.. చంద్రబాబు పోలవరంలో పర్యటించడం.. శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తున్న సంకేతాలు ఇవ్వడం.. వరుసగా మంత్రులు కూడా జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యానికి తోడు.. రాజధాని అమరావతి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించడంలో షేర్‌మార్కెట్ దూకుడు పెరిగింది.
ఒక్క చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీనే కాదు.. ఇతర సంస్థల షేర్లు కూడా.. పుంజుకున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ తోపాటు కేసీపీ సిమెంట్స్, ఆంధ్ర సుగర్స్, పెన్నార్ ఇండస్ట్రీస్, ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ వంటి స్టాక్స్ భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అటు ఇన్‌ఫ్రా సంబంధిత స్టాక్స్ పై కూడా స్టాక్ మార్కెట్ ఆసక్తిగా గమనిస్తోంది. దీంతో ఈ షేర్లు కూడా పుంజుకునే అవకాశంఉందని తెలుస్తోంది.
ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉన్న కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్, వ్యాపార రంగంలో అమరరా జా బ్యాటరీస్‌తో పాటు పలు సిమెంట్ సంస్థలు రెండంకెల లాభాలు అందుకుంటున్నాయి. ఆంధ్ర స్టాక్స్ ఎం-క్యాప్ మొత్తం వ్యాల్యూ ఈ నెలలో దూసుకు పోతోంది. ప్రస్తుతం 2లక్షల,19 వేల కోట్లుగా కొనసాగుతోంది. ఇదిలావుంటే, విశాఖ, విజయవాడ, అమరావతి, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల్లో రియల్ ఎస్టే ట్ వెంచర్లు విరివిగా వేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చే మూడు మాసాల్లో పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఇక, ప్రస్తుతం కట్టిన డబుల్ బెడ్ రూమ్‌ఫ్లాట్లు.. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో గత నెలలో 35-40 లక్షల మధ్య పలకగా.. ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు పెరిగి 40-45 లక్షల మధ్య పలుకుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ధర 50 లక్షలకు పెరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.