చంద్రబాబు : మూడున్నరేళ్ల తర్వాత !
అసెంబ్లీలో ప్రత్యర్థులు చేసిన రాజకీయ విమర్శలతో కలత చెంది సభను విడిచిపెట్టారు.
By: Tupaki Desk | 21 Jun 2024 5:22 AM GMT''కౌరవ సభ నుంచి నిష్క్రమిస్తున్నా. మళ్లీ గౌరవ సభలోనే అడుగుపెడతా’’ అంటూ మూడున్నరేళ్ల క్రితం ఏపీ శాసనసభలో దారుణ అవమానంతో నిష్క్రమించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా నాలుగోసారి శాసనసభలో అడుగుపెట్టారు.
అప్పుడు సభ నుండి వెళ్లిపోతూ చేసిన సవాలును నిలబెట్టుకున్నారు.
2021 నవంబర్ 19న నిండు సభ నుండి సవాలు చేసి వెళ్లిపోయిన చంద్రబాబు ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి శాసన సభలో అడుగుపెడుతున్నారు. అసెంబ్లీలో ప్రత్యర్థులు చేసిన రాజకీయ విమర్శలతో కలత చెంది సభను విడిచిపెట్టారు. శాసనసభలో వ్యక్తిగత దూషణలు, హేళనలు, వ్యక్తిత్వ హననం, కుటుంబ సభ్యులపై నిందలు, విమర్శలతో నలిగిపోయిన చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టనని అప్పుడు శపథం చేశారు.
2019 ఎన్నికల్లో టీడీపీ తరపున 23మంది సభ్యులు గెలిచిన తర్వాత శాసనసభలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని సభా కార్యక్రమాలు నడిపారని విమర్శలు ఉన్నాయి.
శాసనసభలో టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని మాట్లాడే వారికి ఎక్కువగా అవకాశం ఇవ్వడానికి ప్రాధాన్యమిచ్చేవారు. ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే వ్యక్తిగత విమర్శలతో దాడి చేసేవారు. ఈ క్రమంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడును అధికార పార్టీ నేతలు అవమానించడంతో మనస్తాపం చెందిన చంద్రబాబు సభలో అడుగుపెట్టనని సవాలు చేశారు.
2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. నాటి అధికార పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సిఎం హోదాలో గౌరవంగా శాసనసభలో నారా చంద్రబాబు నాయుడు అడుగు పెట్టారు. వైసీపీ నాయకులు చంద్రబాబు కుటుంబ సభ్యులపై దారుణ వ్యాఖ్యలు చేయడంతో సభనుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు ఆవేదనతో మాట్లాడిన మాటల్ని కూడా వైసీపీ నేతలు హేళన చేశారు. చంద్రబాబు 4 సారి ముఖ్యమంత్రిగా సగర్వంగా ముఖ్యమంత్రి హోదాలో 163ఎమ్మెల్యేలతో కలిసి శాసన సభలోకి నేడు అడుగుపెట్టారు.