పోలీసులపై బాబు ఆగ్రహం... ఇకపై నో బారికేడ్స్!
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 15 Jun 2024 1:19 PM GMTతాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం స్పందించిన చంద్రబాబు.. తాను చాలా మారిపోయినట్లు తెలిపారు. ఇందులో భాగంగా... ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రమూ ఉండదని.. రాజకీయ పరిపాలన సాగుతుందని వెల్లడించారు.. మారిన చంద్రబాబుని ప్రత్యక్షంగా చూస్తారని అన్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కు విచ్చేశారు. దీంతో... చాలాకాలం తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయం ముందు సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జై చంద్రబాబు, అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో... ఆ పరిసరప్రాంతం అంతా చంద్రబాబు వర్ధిల్లాలనే నినాదాలతో హోరెత్తిపోయింది.
ఈ సందర్భంగా ప్రతీ శనివారం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారని తెలుస్తుంది.. ఇదే సమయంలో మంత్రులు కూడా అక్కడ అందుబాటులో ఉంటారని తెలుస్తుంది. ఇదే సమయంలో ప్రతీ జిల్లాలోని పార్టీ కార్యాలయాలనూ రెగ్యులర్ గా సందర్శిస్తూ ఉండాలని.. ఇటు ప్రభుత్వాన్ని, అటు పార్టీనీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని బాబు మంత్రులు, నేతలకూ సూచించారు!
అయితే... టీడీపీ ఆఫీస్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పార్టీ కార్యాలయంలో బారికేడ్లు ఏమిటి అంటూ చంద్రబాబు ఫైర్ అవ్వడం గమనార్హం!! ఈ సందర్భంగా... తనకూ, ప్రజలకూ మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని చెప్పిన చంద్రబాబు... ప్రజల సమస్యలు వినడానికి, వినతులు స్వీకరించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తానని తెలిపారు.
ఇలా వినతులు స్వీకరించడమే కాకుండా... వాటి పరిష్కారానికి నిర్ధిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. దీంతో... చంద్రబాబు గతంలో కంటే పూర్తి భిన్నంగా ముందుకు కదులుతున్నాట్లున్నారనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.