చంద్రబాబు "ఫైబర్" పాపం పండింది ఇలా!!
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు.
By: Tupaki Desk | 17 Feb 2024 9:20 AM GMT2014–2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు అవినీతికి కాదేదీ అడ్డు అన్నట్టు చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదు అవుతున్నాయి. వీటిపైన విచారణ చేస్తున్న సీఐడీ ఆధారాలతో సహా వాటిని రుజువు చేస్తోంది.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని తెలుస్తోంది. ఇందులో అవినీతికి సంబంధించి సీఐడీ కీలక ఆధారాలను సేకరించిందని సమాచారం. ఈ మేరకు∙విజయవాడ ఏసీబీ కోర్టులో తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది.
చంద్రబాబు తనకు సన్నిహితుడైన, నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దండుకున్నట్టు సీఐడీ ఆధారాలతో సహా నిగ్గుదేల్చిందని సమాచారం.
ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ కుంభకోణంలో ఏ 1గా చంద్రబాబు, ఏ 2గా టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ 3గా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్, ఇన్ క్యాప్ సంస్థల మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు (ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్)తోపాటు మరికొందరిని నిందితులుగా చేర్చింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం సీఐడీ కేసులు నమోదు చేసింది.
ఫైబర్ నెట్ పేరుతో చంద్రబాబు బృందం ప్రజాధనాన్ని ఎలా దోచుకుందో సీఐడీ తన చార్జిషీటులో కళ్లకు కట్టినట్టు వివరించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు సమయంలో చంద్రబాబును ఏ 25గా సీఐడీ పేర్కొంది. అయితే అసలు సూత్రధారి, పాత్రధారి ఆయనే అని తేలడంతో చార్జిషీటులో ఏ1గా పేర్కొందని సమాచారం.
టెరాసాఫ్ట్ కు ఫైబర్ నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆరోపిస్తోంది. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు మొదటి దశలో రూ.333 కోట్ల పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపింది. ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా చేపట్టాలి అని నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా నాడు పెట్టుబడుల శాఖకు మంత్రిగా చంద్రబాబే ఉండటం గమనార్హం.
వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు ఇందుకు పక్కాగా కథ నడిపించారని సీఐడీ ఆరోపించింది. అందుకోసం వేమూరిని ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా చేర్చారని పేర్కొంది. నేర చరిత్ర ఉన్న ఆయన్ను కీలక స్థానంలో నియమించి పనులు చక్కబెట్టారని అభియోగాలు మోపింది.
అంతేకాకుండా నిబంధనలను విరుద్ధంగా ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా హరికృష్ణను నియమించారని సీఐడీ ఆరోపించింది. ప్రాజెక్టు బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వ్యక్తులు నిబంధనల ప్రకారం టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదు. చంద్రబాబు ఈ నిబంధనలు బేఖాతరు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
అలాగే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ విలువను అడ్డగోలుగా నిర్ణయించారనేది మరో అభియోగం. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండా సరఫరా చేయాల్సిన పరికరాలు, నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతం పెంచేశారని సీఐడీ అభియోగాలు మోపింది.
వాస్తవానికి ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్‌లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ – పోస్ యంత్రాల సరఫరాలో విఫలమైన టెరాసాఫ్ట్‌ను అధికారులు బ్లాక్ లిస్టులో చేర్చారు. అలాంటి కంపెనీని చంద్రబాబు బ్లాక్ లిస్టు నుంచి తొలగించారని సీఐడీ పేర్కొంది. పోటీలో ఉన్న ఇతర కంపెనీలను కాదని ప్రాజెక్టును టెరా సాఫ్ట్ కు కట్టబెట్టేశారని సీఐడీ అభియోగాలు మోపింది.
ఈ క్రమంలో టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్ ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ప్రాజెక్టును దక్కించుకున్నాక టెరాసాఫ్ట్ దాన్ని అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిందని అభియోగాలు ఉన్నాయి. టెండర్ నోటిఫికేషన్ నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో 80 శాతం ప్రాజెక్టు పనులు పనికిరాకుండా పోయాయని ఆరోపించింది.
మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారని అభియోగాలు వెల్లువెత్తాయి. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథను నడిపించారని పేర్కొంది.
ఈ క్రమంలో వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్ కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌పీ అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని ఏర్పాటు చేశారని సీఐడీ అభియోగం. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు అంతా కాగితాలపై సృష్టించారని పేర్కొంది. వాస్తవానికి ఈ కంపెనీ అనేదే లేదని వెల్లడించింది. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసిందని సీఐడీ ఆరోపించింది.
నకిలీ ఇన్వాయిస్‌లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా షెల్ కంపెనీలకు తరలించారని సీఐడీ అభియోగాలు మోపింది. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు, తదితరులకు ఆ మొత్తం చేరిందని సీఐడీ అభియోగాలు మోపింది. నాసిరకమైన పనులతో ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చింది.