Begin typing your search above and press return to search.

తొలి కేబినెట్ భేటీ తర్వాత మంత్రుల వద్ద ఓపెన్ అయిన బాబు

చంద్రబాబు చెప్పిన పది పాయింట్లను టెన్ కమాండ్ మెంట్స్ గా అభివర్ణిస్తున్న వారు లేకపోలేదు. ఇంతకూ ఆ పది అంశాలు ఏమంటే..

By:  Tupaki Desk   |   25 Jun 2024 5:27 AM GMT
తొలి కేబినెట్ భేటీ తర్వాత మంత్రుల వద్ద ఓపెన్ అయిన బాబు
X

పాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ అదే పనిగా తప్పులు చేసే విషయంలో చంద్రబాబుకు మించినోళ్లు లేరన్న విమర్శను ఎదుర్కోవటం తెలిసిందే. అయితే.. అదంతా పాలననను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తారంటూ సర్దిచెప్పేవారు లేకపోలేదు. పాలనలో అధికారుల్ని పరుగులు తీయించాలి.

అదే సమయంలో వారిని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలన్న కొత్త పాయింట్ బాబు తన ఎజెండాలో చేర్చుకున్నారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.. ఆ విషయాన్ని తన మాటల్లోనూ అందరికి అర్థమయ్యేలా చెప్పేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన మొదటి మంత్రివర్గ సమావేశంలో ఆయన ఓపెన్ అయ్యారు.

మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత అధికారులు వెళ్లిపోయిన తర్వాత మంత్రుల వద్ద ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటూ 10సూత్రాల్ని పక్కాగా పాటించాలన్న చంద్రబాబు.. ఏమేం చేయాలన్న విషయాన్ని సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేయటం గమనార్హం.

చంద్రబాబు గురించి.. ఆయన తీరును సుదీర్ఘకాలంగా చూస్తున్న వారు సైతం తాజాగా ఆయన చెప్పిన పది అంశాలపై విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మారిన బాబు అనేదానికి ఇదే పెద్ద ఉదాహరణగా వారు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు చెప్పింది గుడ్డిగా ఫాలో అయితే చాలు.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న మాటను చెబుతున్నారు. మంత్రులకు మంత్రాక్షరిగా మారే ఈ పది పాయింట్లు అత్యంత కీలకమని వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు చెప్పిన పది పాయింట్లను టెన్ కమాండ్ మెంట్స్ గా అభివర్ణిస్తున్న వారు లేకపోలేదు. ఇంతకూ ఆ పది అంశాలు ఏమంటే..

1. హంగూ ఆర్భాటాలు ప్రదర్శించొద్దు. ప్రజల్లో కలిసిపోంది. మీ వద్దకు రాలేని పరిస్థితులు తెచ్చుకోవద్దు.

2. పాలకులమన్న భావన వద్దు. ప్రజలకు సేవకులమన్నట్లుగా పని చేయాలి.

3. ప్రజలకు మనపై భారీ అంచనాలున్నాయి. అందుకు మంత్రులు తమ శాఖలపై పట్టు తెచ్చుకోవాలి.

4. ఎక్కువ కష్టపడాలి. శాఖలపై అవగాహనతో పాటు కొత్త అంశాల్ని నేర్చుకుంటూ ఉండండి.

5. బూతుల భాష వాడొద్దు. అలాంటి భాషను ప్రజలు అసహ్యించుకుంటారు.

6. ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా రాజకీయంగా బదులివ్వండి. బూతల ప్రయోగాలొద్దు.

7. అధికారులతో సౌమ్యంగా మాట్లాడండి. పనులు కాకపోతే ఒత్తిడి పెంచండి. మన ప్రాధాన్యాలు చెప్పండి.

8. అధికారులతో సుదీర్ఘ సమీక్షలు నిర్వహించొద్దు. సాయంత్రం 6 గంటల తర్వాత రివ్యూలొద్దు.

9. క్రమం తప్పకుండా రాష్ట్ర సచివాలయానికి రండి. కార్యాలయ సిబ్బందిని మంచివాళ్లను పెట్టుకోండి.

10. ఏదైనా చిన్న పొరపాటు దొర్లినా అల్లరి చేయటానికి జగన్ మీడియా సిద్ధంగా ఉంటుంది. జాగ్రత్త