రోడ్ల రిపేర్లపై చంద్రబాబు ఫోకస్...కీలక ఆదేశాలు
ఈ క్రమంలోనే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రోడ్ల దుస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.
By: Tupaki Desk | 12 July 2024 4:46 PM GMTవైసీపీ హయాంలో ఏపీలోని రోడ్ల దుస్థితి గురించి ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చేందుకు నిధులు లేని దుస్థితిలో ఖజానాను నెట్టేశారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. ఆర్టీసీ బస్సులు నడిరోడ్డుపై పెద్ద పెద్ద గుంతల్లో ఇరుక్కొని ప్రయాణికులు నరకయాతన అనుభవించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రోడ్ల దుస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.
ఏపీలో రోడ్ల పరిస్థితిపై దృష్టి సారించిన చంద్రబాబు...అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష చేపట్టిన సందర్భంగా రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.300 కోట్లు కావాలని చంద్రబాబును అధికారులు కోరారు. ఏపీలో మొత్తం 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలున్నాయని, తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు 2,936 కిలోమీటర్ల మేర ఉన్నాయని చంద్రబాబుకు అధికారులు వివరించారు. దీంతో, అత్యవసర మరమ్మతుల కోసం తక్షణం టెండర్లు పిలవాలని, జాప్యం లేకుండా పనులు ప్రారంభించాని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
గత ప్రభుత్వం రోడ్లను నిర్లక్ష్యం చేసిందని, ఐదేళ్లు ప్రజలు నరకం చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో ప్రజలకు మెరుగైన ప్రయాణం అందించేలా రోడ్ల మరమ్మత్తులు తక్షణం చేయాలని, ఆ దిశగా అధికారుల పనితీరు ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కాగా, ఏపీ ప్రకృతి సేద్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 2024 సంవత్సరానికి గాను ఏపీ ప్రకృతి వ్యవసాయం ప్రతిష్ఠాత్మక ‘గుల్బెంకియన్’ అవార్డు కైవసం చేసుకోవడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. పోర్చుగల్ రాజధాని లిస్బన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో... ఏపీసీఎన్ఎఫ్ (ఏపీ ప్రకృతి సేద్యం సమాఖ్య), రైతు సాధికార సంస్థ, ప్రకృతి సాగు రైతు నాగేంద్రమ్మ ఈ అవార్డును అందుకున్నారు.
మరోవైపు, ఉండవల్లిలోని నివాసం నుంచి సచివాలయానికి వెళుతుండగా రోడ్డు పక్కన తనకోసం వేచి ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ ను చంద్రబాబు ఆపారు. వారిని కలుసుకుని, వారి సమస్యలు తెలుసుకుని వారు అందించిన వినతులను స్వీకరించారు.