Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఉచిత హామీ అమలు.. కీలక మార్గదర్శకాలు ఇవే!

ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక విధానాన్ని ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. జూలై 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.

By:  Tupaki Desk   |   4 July 2024 7:10 AM GMT
చంద్రబాబు ఉచిత హామీ అమలు.. కీలక మార్గదర్శకాలు ఇవే!
X

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇప్పటికే జూలై 1న పెంచిన పింఛన్లను పంపిణీ చేసి రికార్డు సృష్టించారు.

ఈ నేపథ్యంలో మరో ఉచిత పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హామీని నిలుపుకునే దిశగా చంద్రబాబు అడుగు ముందుకేశారు.

జులై 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేసి, ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక విధానాన్ని ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. జూలై 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.

మార్గదర్శకాలు ఇవే..

– వైసీపీ ప్రభుత్వ హయాంలో టన్ను ఇసుక కావాలంటే రూ.475 చొప్పున చెల్లించాల్సి వచ్చేది. ఇందులో కాంట్రాక్టర్‌ తవ్వకం ఖర్చు, రవాణా ఖర్చు రూ.100 తీసేయగా, మిగిలిన రూ.375 ప్రభుత్వ ఖజానాకు చేరేది. ఇక నుంచి ఇప్పటి వరకు ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక కొనుగోలుదారులకు ఇకపై ప్రతి టన్నుకు రూ.287 భారం తగ్గుతుంది.

– ఇక నుంచి టన్ను ఇసుకకు రూ.375 కాకుండా.. రూ.88 మాత్రమే వసూలు చేస్తారు. ఈ రూ.88 స్థానిక సంస్థలు (గ్రామ పంచాయతీ/మండల పరిషత్‌/జిల్లా పరిషత్‌) కే దక్కుతుంది. రూ.88ల్లో. సీనరేజ్‌ ఛార్జి కింద తీసుకునే రూ.66 (టన్నుకు) నేరుగా ఆ ఇసుక రీచ్‌ లు ఉన్న జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు దక్కుతుంది.

– ఇక ప్రభుత్వ ఖజానాకు రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

– అలాగే జిల్లా ఖనిజ నిధి కింద రూ.19.80 చొప్పున వసూలయ్యే మొత్తం ఇసుక రీచ్‌ ఏ ప్రాంతంలో ఉందో.. ఆ ప్రాంత అభివృద్ధి కోసం జిల్లా ఖాతాకు కేటాయిస్తారు.

– ఇక రూ.88ల్లో మిగిలే రూ.1.32 గనుల శాఖలో ఖనిజాన్వేషణ నిధి కోసం వసూలు చేసే ఖనిజాన్వేషణ ట్రస్ట్‌కు వెళ్తుంది.

– జూలై 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుకను అమ్మినప్పుడు టన్నుకు రూ.88తోపాటు, ఆ నిల్వ కేంద్రానికి (స్టాక్‌ పాయింట్‌) ఏ రీచ్‌ నుంచి ఇసుక తవ్వి, తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్‌ పాయింట్‌ లో లోడింగ్‌ అయ్యే ఖర్చు తీసుకుంటారు. ఈ మొత్తాలను జిల్లా కలెక్టర్లు ఖరారు చేస్తారు.

– ఇసుక తరలించే ప్రతి లారీ, ట్రాక్టర్‌ గనులశాఖ వెబ్‌ సైట్‌ లో రిజిస్టర్‌ చేసుకోవాలి.

–ఓ రూట్‌కు అనుమతి తీసుకొని, మరో మార్గంలో వెళితే అనుమతించరు. చర్యలు తీసుకుంటారు.

– పడవల్లో నదుల్లోకి వెళ్లి బోట్సుమెన్‌ సొసైటీలు తెచ్చే ఇసుకను ఇప్పటి వరకు టన్ను రూ.625కి అమ్ముతున్నారు. ఈ మొత్తంలో నుంచి రూ.200 బోట్సుమెన్‌ సొసైటీకి చెల్లిస్తున్నారు.

– ఇక నుంచి ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఇకపై బోట్సుమన్‌ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకకు రూ.200, సీనరేజ్‌ రూ.88 కలిపి రూ.288 వసూలు చేస్తారు.

– ముందుగా సెప్టెంబరు వరకు ఆన్‌లైన్‌ అనుమతులు లేకుండానే ఇసుకను అమ్ముతారు.

– అక్టోబరు నుంచి ఆన్‌లైన్‌ పర్మిట్లు, ఆన్‌లైన్‌ చెల్లింపులు అమలు చేస్తారు.