Begin typing your search above and press return to search.

మారిన బాబు...మంత్రులకు జోష్!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మారారా అంటే బాగానే మారారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Jun 2024 3:36 AM GMT
మారిన బాబు...మంత్రులకు జోష్!
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మారారా అంటే బాగానే మారారు అని అంటున్నారు. ఆయన ఆలోచనలో భారీ మార్పు కనిపిస్తోంది.దానికి కారణం తమ కళ్ల ముందు వైభవాన్ని చూసి పాతాళానికి కృంగిపోయిన వైసీపీ గుణపాఠంగా మారింది అని అంటున్నారు.

వైసీపీని జనాలు ఏ ఏ విషయాల్లో నిరసించారో వాటిని ససేమిరా కలలో కూడా తలవకూడదు అని బాబు భావిస్తున్నారుట. ఇక పాలనాపరమైన వ్యవాహారాల్లో చూస్తే గత వైసీపీ మంత్రులకు స్వేచ్చ ఉండేది కాదు అని విమర్శలు వచ్చాయి.

అంతా ఏకపక్ష పాలనగా లేదా కోటరీ ద్వారా సాగేదని విమర్శలు ఉండేవి. మంత్రులు అన్న ట్యాగ్ తప్ప సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఆనాడు ఎక్కడా లేదని కూడా విమర్శలు ఉండేవి. అయితే దాని వల్ల పాలనలో కూడా లోపాలు కనిపించేవి. ఏదీ ఎవరు నిర్ణయం తీసుకోవాలో తెలిసేది కాదు ఆఖరుకు చిన్నపాటి బదిలీల విషయంలోనూ చొరవగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు లేదని అంటున్నారు.

ఒక విధంగా నాడు మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా ఉండేవారు అని కూడా ప్రచారం సాగింది. దాంతో చంద్రబాబు కూటమి మంత్రులు ఆ విధంగా ఉండరాదు అని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మంత్రులు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోవచ్చు అని బాబు చెప్పారని టాక్.

అయితే వివాదాల్లో పడకుండా ఏ నిర్ణయం తీసుకున్నా లోతుగా ఒకటికి పదిసార్లు అధ్యయం చేసి తీసుకోవాలని బాబు సూచిస్తున్నారుట. అలాగే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్న వాటిని తొందరగానే నిర్ణయం తీసుకుని అమలు చేయవచ్చు అని కూడా చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.

ప్రతీ చిన్న విషయాన్ని తన దృష్టికి తీసుకుని రావాల్సిన అవసరం లేదని కూడా బాబు పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. డబ్బుకు సంబంధం లేని అంశాలు చాలా ఉంటాయని ఖజానకు భారం కాని విషయాలు నిర్ణయాలు మంత్రులే చొరవగా నిర్ణయాలు తీసుకుని జనాలకు మేలు చేయవచ్చు అని ఫ్రీ హ్యాండ్ ని బాబు ఇచ్చారని అంటున్నారు.

వీటితో పాటుగా మంత్రులు తమ శాఖల పట్ల పట్టు పెంచుకోవాలని ఆయన సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రతీ శాఖ మంత్రి పూర్తి అవగాహనతో ఉండాలని ఆయన కోరారని అంటున్నారు. ఇక మంత్రులు అంతా సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అయి వస్తే అధికారులు కూడా వారికి సహకరించేందుకు సిద్ధంగా ఉంటారని బాబు అన్నారని తెలుస్తోంది.

గతంలో అంటే బాబు ఇంతకు ముందు సీఎం గా ఉన్నపుడు అన్నీ తనతోనే అన్నట్లుగా వ్యవహరించేవారు అని ఇపుడు ఆయన మారిన బాబు అని అంటున్నారు. ఇక బాబు అనుభవం అంత వయసు లేని వారు కూడా కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. వారంతా తమ టాలెంట్ ని చూపించాలని అంతా కలసి పాలనలో భాగం కావాలని సీనియర్స్ విత్ జూనియర్స్ అన్నట్లుగా ముందుకు సాగితేనే ప్రజలకు మంచి చేయగలమని బాబు గట్టిగా నమ్ముతున్నారుట.