బాబుకు విశ్వాసపాత్రుడు
అందుకే ఆయనను చంద్రబాబు అతి పెద్ద పదవిలో కూర్చోబెట్టారు. అయ్యన్నకు రాజకీయ జీవిత చరమాంకంలో మరచిపోలేని గిఫ్ట్ నే బాబు ఇచ్చారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 23 Jun 2024 4:08 AM GMTసీనియర్ మోస్ట్ లీడర్లు టీడీపీలో ఎందరో ఉన్నారు. కానీ అందరికీ దక్కని అందలం ఆయనకే దక్కింది ఎందుకు అంటే ఆయన పార్టీకి అధినేతకూ అత్యంత విశ్వాసపాత్రుడు కాబట్టే అంటున్నారు. అందుకే ఆయనను చంద్రబాబు అతి పెద్ద పదవిలో కూర్చోబెట్టారు. అయ్యన్నకు రాజకీయ జీవిత చరమాంకంలో మరచిపోలేని గిఫ్ట్ నే బాబు ఇచ్చారు అని అంటున్నారు.
అయ్యన్నపాత్రుడుని 1983లో పిలిచి అన్న ఎన్టీఆర్ టికెట్ ఇచ్చారు. అసలు అన్న గారు నర్శీపట్నం టికెట్ ని ఇద్దామనుకున్నది అయ్యన్న తాత లచ్చాపాత్రుడుకి. నర్సీపట్నంలో క్షత్రియ సామాజిక వర్గం ఆధిపత్యం ఆ రోజులలో ఉండేది. వారే ఆనేక సార్లు నెగ్గుతూ వచ్చేరు. అయితే వారిని తట్టుకుని నర్శీపట్నం పంచాయతీ సర్పంచ్ గా లచ్చాపాత్రుడు గెలుస్తూ వచ్చారు. అలా బీసీ వర్గాలలో బలమైన నేతగా నిలబడ్డారు.
దాంతో కొత్తవారిని బీసీలను రాజకెయంగా ప్రోత్సహించాలని భావించి లచ్చాపాత్రుడు గురించి విని ఎన్టీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వచూసారు. కానీ వయోభారం వల్ల తనకు వద్దు అని లచ్చాపాత్రుడు సున్నితంగా చెప్పేశారు. అలా ఆ అవకాశం పాతికేళ్ల వయసులో ఉన్న అయ్యన్నకు దక్కింది.
అలా అయ్యన్న 1983లో ఎమ్మెల్యే అయ్యారు. 1985లో ఎన్టీఆర్ కేబినెట్ లో పిన్న వయసులోనే మంత్రి అయ్యారు. ఇక ఆయన రాజకీయ జీవితం వెనక్కు చూసుకోలేని విధంగా సాగింది. పార్టీకి కట్టుబడిన నేతగా అయ్యన్న ఈ రోజుకీ ఉన్నారు. అప్పట్లో ఎన్ టీయార్ ఆ తరువాత చంద్రబాబు ఈ ఇద్దరి మాట జవదాటలేదు అయ్యన్న.
దీనికి మరో ఉదాహరణ కూడా చెప్పుకోవాలి. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత అయ్యన్నకు కేబినెట్ లో తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే లోక్ సభకు ఎన్నికలు వచ్చాయి. టీడీపీకి బాబుకు లైఫ్ అండ్ డెత్ లాంటి ఆ ఎన్నికల్లో మంత్రులనే పోటీగా పెట్టాలని చూస్తే చాలా మంది బంగారం లాంటి మినిస్టర్ పోస్టు వదులుకోవడానికి ఇష్టపడలేదు. కానీ అయ్యన్నపాత్రుడు మాత్రం బాబు మాటకు ఓకే చెప్పి అలా 1996లో ఎంపీగా అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు.
ఇది ఎందుకు అంటే అధినాయకత్వం మీద ఆయనకు ఉన్న విధేయత. ఇక పార్టీ గెలిచినా ఓడినా ఆయన ఎపుడూ పోరాడేవారు. అధికారంలోనే ఉండాలని వారు పెట్టే ప్రలోభాలకు లోను కాకుండా నమ్ముకున్న టీడీపీ జెండాకే అంకితం అయిపోయారు. అందుకే చంద్రబాబుకు అయ్యన్న మీద అంత నమ్మకం.
ఇక పార్టీలో అయ్యన్న మాటకు బాబు ఎంతో విలువ ఇస్తారు. ఆయన తన అభిప్రాయాన్ని మీడియా ముందే కుండబద్ధలు కొట్టినా దానిని బాబు పాజిటివ్ గానే తీసుకునే వారు. ఆయన చెప్పే దాంటో విషయం ఉందని భావించి తగిన చర్యలు తీసుకునేవారు. అలా అయ్యన్న టీడీపీ అధికారంలో ఉన్నపుడు కొన్ని సార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా అది పార్టీ శ్రేయస్సు కోసమే అని బాబు సైతం అంగీకరించేవారు.
పార్టీ కోసం దేనికైనా అన్న అయ్యన్న తత్వం బాబును సైతం మెచ్చుకునేలా చేసింది. టీడీపీ పుట్టిన దగ్గర నుంచి కొనసాగుతూ వస్తున్న నాయకులు ఎందరో ఉన్నా చాలా మంది మధ్యలో అటూ ఇటూ విధేయతలు మార్చిన సందర్బాలు ఉన్నాయి. అయ్యన్న మాత్రం దానికి భిన్నం. పైగా పార్టీ తనకు జీవితం ఇచ్చింది తల్లి లాంటిది అని ఆయన చెబుతూ వచ్చేవారు.
ఇలా అయ్యన్న వంటి వారు ఉంటే చాలు అని బాబు అనుకునే నేపధ్యమూ ఉంది. అందుకే ఆయనకు బాబు మంత్రి పదవి ఇవ్వలేదు. దాంతో అంతా అయ్యన్నను అలా పక్కన పెట్టారా అనుకున్నారు. కానీ అంతకు మించి అన్నట్లుగా స్పీకర్ పదవిని కట్టబెట్టారు. ఎన్నో సార్లు మంత్రి చేసిన అయ్యన్నకు ఇది జీవిత కాలం తృప్తిని ఇచ్చే పదవిని అని చెప్పాల్సి ఉంది.
ఇదిలా ఉంటే అయ్యన్నను అభినందిస్తూ బాబు చేసిన ప్రసంగం ఆయన పట్ల బాబుకు ఉన్న అభిమానం తెలియచేస్తుంది. అలాగే అయ్యన్న సభకు ధన్యవాదాలు చెబుతూ చివరిలో చేసిన ప్రసంగంలో అన్న మాటలు వింటూ బాబు భావోద్వేగానికి గురి అయ్యారు. నాకు టీడీపీ ఎంతో ఇచ్చింది. అందుకే అంటూ ఉంటాను, పార్టీ జెండా కప్పుకునే చనిపోవాలని అని స్పీకర్ చెయిర్ నుంచి అయ్యన్న ఈ మాటలు అంటూంటే బాబు బాగా ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి టీడీపీ పుట్టాక ఏమిచ్చింది అన్న ప్రశ్నకు అయ్యన్న లాంటి వారు ఎందరినో అని జవాబు చెప్పాలేమో.