జగన్ విధానం రద్దు.. వారికి చంద్రబాబు గుడ్ న్యూస్!
గత వైసీపీ విధానాలను రద్దు చేస్తూ.. పలు విషయాల్లో చంద్రబాబు సర్కారు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 8 July 2024 3:44 AM GMTగత వైసీపీ విధానాలను రద్దు చేస్తూ.. పలు విషయాల్లో చంద్రబాబు సర్కారు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న వైఎస్సార్ పంటల బీమా పథకాన్ని రద్దు చేస్తూ.. ప్రకటన జారీ చేశారు. దీని వల్ల మెజారిటీ రైతులకు మేలు జరగలేదని.. చంద్రబాబు సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని రద్దు చేయడంతోపాటు.. 2014-19 మధ్య అమలైన రైతుల పథకాలను తీసుకురావాలని నిర్ణయించా రు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
వైసీపీ హయాంలో అనుసరించిన విధానాలవల్ల వ్యవసాయం భారంగా మారిందన్నది ప్రస్తుత ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రాయితీలు, విధానాల ద్వారా సాగు ఖర్చు తగ్గించాలని నిర్ణయించుకుంది. 2014-19 మధ్య జరిగిన పాలనలో అమలైన కీలక వ్యవసాయ పథకం `జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్` విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. తద్వారా రైతులకు మరిన్ని మేళ్లు జరుగుతాయన్నది ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆలోచనగా ఉంది. దీంతో ఇప్పటి వరకు అమల్లో ఉన్న పథకాలను రద్దు చేయనున్నారు.
జగన్ సర్కారు రైతుల పంటల బీమా ప్రీమియంను స్వయంగా చెల్లించింది. ఈ-క్రాప్ ద్వారా పంటలను నమోదు చేసి ప్రీమియం చెల్లిస్తూ వచ్చారు. ఈ విషయంలో తప్పులు జరిగాయని, సాంకేతిక కారణాలతో చాలా మంది రైతులకు బీమా అందలేదనేది టీడీపీ అప్పట్లోనే ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పాత పంటల బీమా విధానాన్ని మరోసారి తీసుకురావాలని సర్కారు తలపెట్టింది. తద్వారా.. అధునాత సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలన్న సర్కారు లక్ష్యం నెరవేరనుందని అధికారులు చెబుతున్నారు.
కొత్త విధానంలో ఏం జరుగుతుంది?
+ రైతులకు పంటలపై మరింత అవగాహన కల్పిస్తారు.
+ డ్రోన్లతో పురుగుమందులను పిచికారీ చేసే విధానంపై అధ్యయనం చేసి రైతులకు వాటిపై అవగాహన కల్పించనున్నారు.
+ రైతుల భాగస్వామ్యంతోనే పంటల బీమా విధానాన్ని కొనసాగించనున్నారు.
+ ఐఏఎస్ అధికారులు కూడా పొలాలకు వెళ్లి రైతులతో నేరుగా మాట్లాడి.. వారి కష్ట సుఖాలు పంచుకోనున్నారు.
+ 2014-19 మధ్య రైతులకు వరంగా మారిన సాయిల్ టెస్ట్(మట్టి పరీక్షలు) మళ్లీ కొనసాగించనున్నారు.
+ రాయితీలద్వారా డ్రిప్పులను రైతులకు చేరువ చేయనున్నారు.