శ్వేత పత్రాలు ఇస్తే.. మంచిదేనా బాబూ!
ఇదిలావుంటే.. అసలు ఇప్పుడున్న పరిస్థితిలో శ్వేత పత్రాలు విడుదల చేయడం మంచిదేనా? అనే చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 24 Jun 2024 12:30 PM GMTఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. కీలక విషయం చర్చకు వస్తోంది. గత వైసీపీ సర్కారు అనుసరించిన విధానాలపైనా.. తీసుకున్న నిర్ణయా లపైనా.. చేసిన ధ్వంసంపైనా.. శ్వేత పత్రాలు విడుదల చేస్తామని ఒకరిద్దరు మంత్రులు చెప్పుకొచ్చారు. టీడీపీ, ప్రభుత్వ అనుకూల మీడియా కూడా.. శ్వేతపత్రాలు సిద్ధమవుతున్నాయని చెబుతున్నాయి. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఇదిలావుంటే.. అసలు ఇప్పుడున్న పరిస్థితిలో శ్వేత పత్రాలు విడుదల చేయడం మంచిదేనా? అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే.. శ్వేత పత్రం అనేది.. అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. ఇది ఇక రికార్డు. దీనిని చెర పడానికి కుదరదు. ఇది ఒక కారణం. మరో కీలక అంశం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రగతి, లోపాలు.. ఎక్కడ తప్పులు జరిగాయి.. వంటివన్నీకూడా.. బయటకు వస్తాయి. ఇలా అన్నీ బయటకు వస్తే.. రాష్ట్రానికి మంచిదేనా? అనేది కూడా చర్చ.
ఎందుకంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతల పరిస్థితి బాగోలేదని.. రాజకీయ పార్టీలు చెప్పడం వేరు .. నేరుగా ప్రభుత్వమే శ్వేత పత్రం రూపంలో ఒప్పుకోవడం వేరు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు చంద్రబా బు కనుక అన్నింటిపైనా శ్వేతపత్రాలు విడుదల చేస్తే.. ఆయన అభిలషిస్తున్న పెట్టుబడులపై ప్రభావం చూపే పరిస్థితి ఉంటుంది. ''రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతల పరిస్థితి బాగోలేదని.. ప్రభుత్వమే చెబుతున్న నేపథ్యంలో కొన్నాళ్లు వేచి చూద్దాం'' అని పెట్టుబడి దారులు భావిస్తే.. అది చంద్రబాబుకు , ఆయన చేపట్టిన కార్యక్రమాలకు కూడా ఇబ్బందే.
అందుకే.. శ్వేత పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్నాళ్ల కిందట తెలంగాణలో ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలానే శ్వేత పత్రాలు విడుదల చేసి సాధించింది కూడా ఏమీ కనిపించలేదు. పైగా ఒకటి రెండు సంస్థలు వస్తామని కూడా..ఇ ప్పటి వరకు మొహం చూపించలేదు. సో.. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు మేధావులు.