శ్వేత పత్రం అంటే ఏంటో తెలుసా..?
శ్వేత పత్రాలు. ప్రస్తుతం ఏపీలోని కూటమి సర్కారు.. శ్వేత పత్రాలను విడుదల చేసేందుకు రెడీ అయింది.
By: Tupaki Desk | 28 Jun 2024 11:30 AM GMTశ్వేత పత్రాలు. ప్రస్తుతం ఏపీలోని కూటమి సర్కారు.. శ్వేత పత్రాలను విడుదల చేసేందుకు రెడీ అయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు శాఖలు నిర్వీర్యమయ్యాయని.. ఆర్తికంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించిన టీడీపీ, జనసేన నాయకులు.. ఇప్పుడు ఆయా పనులను.. జగన్ హయాంలో చేసిన అభివృద్ధి లేదా విధ్వంసాన్ని, ఆర్థిక అసమానతలను, అప్పులను కూడా.. ఈ పత్రాల రూపంలో ప్రజలకు వివరించనున్నారు.
అయితే.. అసలు శ్వేత పత్రం అంటే ఏంటి? ఇది ఎలా వచ్చింది? దీనిలో ఏం చెబుతారు? అనే విషయా లు కీలకం. వీటిపైనే అనేక మంది సందేహాలు కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఉదాహరణకు సమాజంలో ఒక మాట ఉంది... ``వైట్ కాలర్ జాబ్`` అని! అంటే.. కాయకష్టం చేయకుండా.. మేధాశక్తిని వినియోగించి.. ప్రశాంతంగా చేసుకునే ఉద్యోగం అని అర్థం. వీటిలోకి ఐఏఎస్, ఐపీఎస్ సహా..సాఫ్ట్ వేర్ జాబ్స్ కూడా వస్తాయి. వైట్ కాలర్ అన్నంత మాత్రాన .. అందరూ వైట్ కాలర్ ధరిస్తారని కాదు.
అలానే.. శ్వేత పత్రం లేదా వైట్ పేపర్ కూఆ. ఇది బ్రిటీష్ హయాం నాటి కాన్సెప్టు. తెల్ల కాయితం అని పిలుచుకున్నా.. దీనిలో విషయం వేరేగా ఉంటుంది. గత ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేందుకు ప్రస్తు తం ప్రభుత్వాలు ఈ పదాన్ని వాడుతున్నాయి. అసెంబ్లీలో ప్రకటించే అలవాటు ఉండేది. అయితే.. రాను రాను.. ఎవరూ కూడా.. ఏ ప్రభుత్వం కూడా.. వైట్ పేపర్‌ను రిలీజ్ చేసేందుకు ఇష్టపడడం లేదు. దీంతో దేశంలో శ్వేత పత్రం అనే కాన్సెప్టును ప్రజలు దాదాపు మరిచిపోయారు.
తాజాగా చంద్రబాబు ప్రబుత్వం ఏకంగా ఏడు శాఖలకు సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పింది. ఇక్కడ వైట్ పేపర్ అంటే.. ``ఉన్నది ఉన్నట్టు`` అని అర్థం. గతంలో బ్రిటీష్ హయాంలో ఈ పేరు ఎక్కువగా భారత్‌లో వినిపించింది. బ్రిటీష్ రాజ్యాంగంలో నూ ఇది ఉంది. ప్రభుత్వంపై విమర్శలు వచ్చినప్పుడు.. లేదా ఆరోపణలు వచ్చినప్పుడు. వైట్‌పేపర్ విడుదల చేయడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. అంటే.. ``ఉన్నది ఉన్నట్టు వివరించడం``. తర్వాత కాలంలో గత ప్రభుత్వాల లోపాలను ఎత్తి చూపేందుకు దీనిని తీసుకువచ్చారు. భారత్‌లో తొలి వైట్ పేపర్.. సైమన్ కమిషన్‌పై విడుదల చేశారు.