Begin typing your search above and press return to search.

చంద్రబాబుకి నితీష్ తో ఈ తలకాయ నొప్పి ఏంటి ?

అలాగే ఎన్నికలకు రెండు నెలల ముందు బాబు టీడీపీ ఎన్డీయేలో చేరింది.

By:  Tupaki Desk   |   2 July 2024 3:42 AM GMT
చంద్రబాబుకి నితీష్ తో ఈ తలకాయ నొప్పి ఏంటి ?
X

ఏపీ సీఎం చంద్రబాబుకు బీహార్ సీఎం నితీష్ తలనొప్పిగా మారారా అంటే రాజకీయాల మీద అవగాహన ఉన్న వారు అవును అనే అంటారు. ఆంధ్రా బాబుకు బీహారీ బాబుకు మధ్య ఈ లింక్ ఏంటి అంటే అదే రాజకీయ తమాషా. ఇద్దరూ పాత మిత్రులే కానీ ఎన్డీయేలో కొత్తగా మిత్రులు అయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందే నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీయేతో జట్టు కట్టారు.

అలాగే ఎన్నికలకు రెండు నెలల ముందు బాబు టీడీపీ ఎన్డీయేలో చేరింది. ఇలా చూసుకుంటే ఎనిమిది నెలల క్రితం వరకూ ఈ ఇద్దరిదీ ఎవరి దారి వారిదే. కానీ ఇపుడు ఇద్దరూ జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఘట్ బంధన్ లో కీలక భాగస్వాములు. అంతే కాదు చెరో వైపు ఇద్దరూ ఎన్డీయే సర్కార్ ని మోస్తున్నారు.

దాంతో ఇద్దరి పేర్లూ జాతీయ స్థాయిలో మారుమోగుతున్నాయి. ఇద్దరికీ అనుభవం గణనీయంగా ఉంది. నితీష్ ఇరవయ్యేళ్ళ సీఎం. చంద్రబాబు పదమూడేళ్ల సీఎం. ఇలా ఇద్దరూ ప్రాంతీయంగా బలమైన నేతలు. జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. మరీ ముఖ్యంగా తాజాగా కేంద్రంలో మూడవసారి ఏర్పాటు అయిన మోడీ ప్రభుత్వానికి ఇద్దరూ ప్రాణవాయువుని అందిస్తున్నారు.

ఇక చూస్తే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయి మూడు వారాలే అయింది. జూలై 9 కి సరిగ్గా నెల అవుతుంది. అయితే ఇంతలోనే నితీష్ కుమార్ తనదైన రాజకీయాన్ని చూపిస్తున్నారు. ఆయన ఉన్నట్టుండి అందుకున్న ప్రత్యేక హోదా స్లోగన్ అటు మోడీని ఢీ కొట్టడానికే అయినా అది ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా గట్టిగానే గుచ్చుకుంటోంది అని అంటున్నారు.

ఏపీలో చూస్తే ప్రత్యేక హోదా డిమాండ్ కి పదేళ్ళ వయసు ఉంది. దాని విలువ ఎంతో బాబుకే బాగా తెలుసు. 2019లో అధికారం పోవడానికి ప్రత్యేక హోదా అతి ముఖ్య కారణం. ఈ హోదా కోసమే ఎన్డీయే నుంచి బాబు బయటకు వచ్చారు. ఈ హోదాను తెస్తాను కేంద్రం మెడలు వంచుతాను అని ఊరూరా యువభేరిలు నిర్వహించి జగన్ జనాల వద్ద మార్కులు కొట్టేసారు.

ఇలా ప్రత్యేక హోదా టీడీపీకి బాబుకు చేసిన నష్టం ఇంతా అంతా కాదు. అది ఒక ఎమోషన్. జనాలకు కనెక్ట్ అయితే దాని పవర్ ఏంటో తెలుసు. అందుకే బాబు ఈసారి ఎక్కడా ప్రత్యేక హోదా అన్న మాట లేకుండానే ఎన్నికల గండాన్ని దాటారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉన్నా కూడా హోదా ఊసు ఎత్తకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఈ నేపధ్యంలో ఏపీ నుంచి హఒదా డిమాండ్ వస్తే దానిని తుత్తునియలు చేసే శక్తి బాబుకు ఉంది. జగన్ మళ్ళీ హోదా మాట ఎత్తినా జనాలకు అంతలా ఎక్కదు. ఎందుకంటే ఆయనకు 22 ఎంపీలు ఇచ్చినా హోదాని సాధించలేకపోయారు అన్న వ్యతిరేకత ఉంది. ఇక కాంగ్రెస్ హోదా నినాదం ఎంతగా వినిపించినా బాబుకు వచ్చిన నష్టం లేదు. '

ఇలా ఏపీలో పాలిటిక్స్ సానుకూలంగానే ఉంది. కానీ బీహారీ బాబు మాత్రమే కెలికి వదిలి పెడుతున్నారు. నితీష్ ప్రత్యేక హోదా అస్త్రం తీయడంతోనే బాబుకు తలకాయ నొప్పి ఎక్కువ అయిపోయింది అని అంటున్నారు. బీహార్ బాబు నితీష్ కే హోదా మీద అంత పట్టుదల ఉంటే ఏపీ అన్ని విధాలుగా విభజన వల్ల నష్టపోయిన నేపధ్యంలో చంద్రబాబు ఎందుకు అడగరు అని జనాలు అనుకుంటున్నారు.

ఇక మెల్లగా ఇది రాజకీయ పార్టీలకు కూడా చుట్టుకునేలా ఉంది. హోదా మీద ఒట్టు పెట్టినట్లుగా ఉంటున్న వారంతా కచ్చితంగా గొంతు సవరిస్తారు. నితీష్ ఇది అంతం కాదు ఆరంభం అన్నట్లుగా స్పెషల్ స్టాటస్ స్లోగన్ వినిపించారు. అయితే ఇది అంతకంతకు రాజుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

వచ్చే ఏడాది నవంబర్ లో బీహార్ ఎన్నికలు ఉన్నాయి. అప్పటి దాకా అంటే బిగిసి మరీ పదహారు నెలలు ఉంది. అంటే దిన దిన గండం కేంద్రంలోని మోడీకే కాదు ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా అని అంటున్నారు. ఈ హోదా అంశాన్ని మరింత స్ట్రాంగ్ గా నితీష్ వినిపించే కొద్దీ ఆ సెగలూ పొగలూ బాబుని కూడా తాకడం ఖాయం. ఒక విధంగా ఏపీలోని విపక్ష వైసీపీకి ఆయన ఆయుధం ఇస్తున్నారు. అలాగే ఏపీ ప్రజలలో దాగి ఉన్న ఆకాంక్షను బయటకు తీస్తున్నారు. దీంతో బాబు కూడా మోడీని హోదా గురించి డిమాండ్ చేయక తప్పేట్లు లేదని అంటున్నారు.