Begin typing your search above and press return to search.

వారి మాన‌సిక సంతృప్తి.. చంద్ర‌బాబు త‌ల‌నొప్పేగా!

టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. కొంద‌రు నాయ‌కులు వారి వ్య‌క్తిగ‌త విష‌యాల ను తెర‌మీదికి తెస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 July 2024 8:49 AM GMT
వారి మాన‌సిక సంతృప్తి.. చంద్ర‌బాబు త‌ల‌నొప్పేగా!
X

టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. కొంద‌రు నాయ‌కులు వారి వ్య‌క్తిగ‌త విష‌యాల ను తెర‌మీదికి తెస్తున్నారు. వారి మానసిక సంతృప్తి కోసం.. సీఎం చంద్ర‌బాబును ఇరుకున పెట్టేలా వ్య‌వ హరిస్తున్నారు. ప‌ట్టుబ‌డుతున్నారు. కామెంట్లు చేస్తున్నారు. ``ఈ మాత్రం చేయ‌లేరా?`` అంటూ కొన్ని వ్యాఖ్య‌లు చేస్తూ.. వేడి పుట్టిస్తున్నారు. నిజానికి ప్ర‌భుత్వం ఉన్న‌ది.. పైగా నెల రోజుల పాల‌న పూర్తి చేసుకున్న‌దీ ఎవ‌రి వ్య‌క్తిగ‌త విష‌యాలో.. ఎవ‌రి వ్య‌క్తిగ‌త ఆనందం కోస‌మో కాదు క‌దా! అలా అనుకుంటే.. నారా లోకేష్‌కు వ్య‌క్తిగ‌త విష‌యాలు లేవా..? చంద్ర‌బాబుకు వ్య‌క్తిగ‌త అంశాలు లేవా?

ఈ విష‌యాన్ని మ‌రిచిపోతున్న కొంద‌రు త‌మ్ముళ్లు.. పార్టీని ఇరుకున పెట్టేలా.. ముఖ్యంగా సీఎం చంద్ర‌బా బును ఇరుకున పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తూ.. వ్యాఖ్య‌లు చేస్తుండ‌డం.. మీడియా ముందుకు వ‌స్తుండ‌డం వంటి వి స‌హ‌జంగానే చంద్ర‌బాబు పాల‌న‌కు బ్రేకులు వేస్తున్న ప‌రిస్థితి.. ప్ర‌తిప‌క్షానికి అవ‌కాశం క‌ల్పిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పోనీ.. ఇలా త‌మ వ్య‌క్తిగ‌త ఆనందం కోసం.. ప్ర‌య‌త్నిస్తున్న‌వారు చిన్న‌వారు.. నిన్న మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారు కాదు. అనుభ‌వం ఉన్న‌వారే! దీంతో చంద్ర‌బాబు ఎటూ చెప్ప‌లేక స‌త‌మతం అవుతున్నారు.

ఏంటి విష‌యం!

+ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ఉన్నారు. ఆయ‌న కుమారుడు అస్మిత్ రెడ్డి.. ఎమ్మె ల్యేగా గెలిచారు. ఇప్ప‌టికిప్పుడు వీరు కోరుతున్న‌ది.. వైసీపీ నాయ‌కుల‌ను నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌రిమి కొట్ట‌డం. జోక్ కాదు.. నిజ‌మే. వారే స్వ‌యంగా చెబుతున్నారు. ``చంద్ర‌బాబు చేస్తాడో లేదో చూస్తాం`` అని.. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మీడియా ముఖంగానే వ్యాఖ్యానించారు. లేక‌పోతే.. తామే రంగంలోకి దిగుతామ‌ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. ఇప్ప‌టికే వైసీపీ నాయ‌కుల‌ను ఆయ‌న టార్గెట్ చేస్తున్నారు. దీంతో తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని పోలీసులు కంటిపై కునుకు లేకుండా ఉన్నారు.

+ ప‌రిటాల శ్రీరాం. ఉమ్మ‌డి అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పుత్ర ర‌త్నం. ఈయ‌న కూడా.. మీడియా ముఖ్యంగా.. మానసిక ఆనందం కోసం..వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాష్‌రెడ్డిపై 307 బుక్ చేయాల‌ని.. ఎన్నిక‌ల‌కు ముందు త‌మ వారిపై దాడులు చేసి.. హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించార‌ని ఆయ‌న చెబుతున్నారు. కానీ, దీనిపై కేసులు ఇప్ప‌టికే న‌మోదయ్యాయి. విచార‌ణ కూడా జ‌రుగుతోంది. అయితే.. సెక్ష‌న్ 307 న‌మోదు చేసే తీవ్రత లేద‌ని పోలీసులు చెబుతున్నారు. కానీ, శ్రీరాం మాత్రం దూకుడుగా ఉన్నారు. స‌ర్కారు ఎందుకు ఇలా చేస్తోంద‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

+ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఉండి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఎమ్మెల్యే. గ‌తంలో వైసీపీ లో ఉన్న‌ప్పుడు.. ఎలా అయితే.. వ్య‌వ‌హ‌రించారో.. ఇప్పుడు కూడా అంతేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సీఎం చంద్ర‌బాబును ఆయ‌న ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూ.. వైసీపీ హ‌యాంలో త‌న‌పై హ‌త్యాయత్నం చేశార‌ని.. ఐపీఎస్ అధికారులు.. సునీల్‌, సీతారామాంజ‌నేయులుపై ఆయ‌న కేసులు పెట్టారు. ఇక్క‌డితో ఆగ‌కుండా.. ఆయ‌న స‌ర్కారు ఉదాశీనంగా ఉంద‌ని.. అనేశారు. వీరిపై కేసులు న‌మోద‌య్యాయి కాబ‌ట్టి.. వెంట‌నే స‌స్పెండ్ చేసేసి.. విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేస్తూ.. గంట‌కోసారి మీడియా ముందుకు వ‌స్తున్నారు.

సాధ్య‌మేనా?

టీడీపీ నాయ‌కులు కోరుతున్న‌ట్టు చేయ‌డం .. చంద్ర‌బాబుకు సాధ్య‌మేనా? అంటే.. సాధ్యం కాదు. ఐపీఎస్‌ల‌పైనే కాదు.. అనేక మందిపై కేసులు న‌మోదయ్యాయి. అంత మాత్రాన వారిని స‌స్పెండ్ చేస్తే.. మిగిలిన అధికారుల్లో భ‌యం ఏర్ప‌డ‌దా? వారు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇక‌, రాజకీయంగా వైసీపీ వారిని త‌రిమికొట్టేందుకు స‌ర్కారు ఎక్క‌డైనా ప్ర‌య‌త్నిస్తుందా? ఇవ‌న్నీ .. తెలిసి కూడా.. చంద్ర‌బాబును ఇరుకున పెట్టేలానాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.