Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు మ‌రో రెండు గంట‌ల క‌ష్టం త‌ప్ప‌దా?

ప‌ని రాక్ష‌సుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఇప్ప‌టికే 18 గంట‌ల పాటు ప‌నిచేస్తున్నార‌నే విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 July 2024 6:30 AM GMT
చంద్ర‌బాబు మ‌రో రెండు గంట‌ల క‌ష్టం త‌ప్ప‌దా?
X

ప‌ని రాక్ష‌సుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఇప్ప‌టికే 18 గంట‌ల పాటు ప‌నిచేస్తున్నార‌నే విష‌యం తెలిసిందే. ఆయ‌నతో పోటీ పడేందుకు పొరుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా.. లైన్‌లో ఉ న్నారు. అయితే.. తాజాగా ఈ ప‌నిగంట‌లు కూడా చంద్ర‌బాబుకు స‌రిపోయేలా లేవ‌ని తెలుస్తోంది. ఎందు కంటే.. రాజ‌ధాని అమ‌రావ‌తి ఉన్న దుస్థితిని చూశాక‌.. మ‌హాన‌గ‌రాన్ని నిర్మించేందుకు గ‌త ఐదేళ్ల‌లో జ‌రిగిన విధ్వంసాన్ని అడ్డుకుని లైన్‌లో పెట్టేందుకు చంద్ర‌బాబు మ‌రింత క‌ష్ట‌ప‌డాల్సి ఉంది.

ప్ర‌స్తుతం ఏపీ స‌ర్కారు ప్ర‌ధాన ప్రాతిప‌దిక‌.. ప్ర‌ధాన విష‌యం.. అమ‌రావ‌తి రాజ‌ధాని. వ‌చ్చే నాలుగేళ్ల‌లో దీనికి మ‌రింత విస్తృత రూపం క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంది. అంతేకాదు.. పెట్టుబ‌డులు కూడా తీసు కురావాల్సి ఉంది. గ‌తంలో స్థ‌లాలు కేటాయించిన సంస్థ‌లు వెళ్లిపోయాయి. గ‌తంలో పెట్టుబ‌డులు పెడ‌తామ‌న్న సంస్థ‌లు ప‌రార‌య్యేలా గ‌త ప్ర‌బుత్వం వ్య‌వ‌హ‌రించింది. ఈ నేప‌థ్యంలో గ‌త త‌ప్పులు స‌రిచేయ‌డ‌మే కాదు.. ఆయా సంస్థ‌ల‌ను ఆహ్వానించాలి.

అయితే.. ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం.. 2019లో వ‌చ్చిన ప్ర‌భుత్వం అప్ప‌టి స‌ర్కారు చేప‌ట్టిన ప్రాజెక్టుల‌ను నిలిపివేసిన ద‌రిమిలా.. అంత‌ర్జాతీయ సంస్థ‌లు తిరిగి ఏపీలో అడుగు పెట్టేందుకు ఆలోచ‌న చేస్తాయి. వ‌చ్చేందుకు త‌ట‌ప‌టాయిస్తాయి. వాస్త‌వానికి చంద్ర‌బాబు హైద‌రాబాద్ శివారులో రింగ్ రోడ్డును త‌ల‌పెట్టిన‌ప్పుడు.. ప్రైవేటు సంస్థ‌కు ఇచ్చారు. దీనిని వైఎస్ కొన‌సాగించారు. ఫ‌లితంగా నిర్మాణ రంగ కంపెనీలు.. వ‌చ్చాయి. చేశాయి.

కానీ, ఏపీలో అలా జ‌ర‌గ‌లేదు. బాబు స‌ర్కారు తీసుకున్న ప్ర‌తినిర్ణ‌యాన్నీ జ‌గ‌న్ బుట్ట‌దాఖ‌లు చేశారు. కాంట్రాక్టు సంస్థ‌లు వెళ్లిపోయేలా చేశారు. ఇదే ఇప్పుడు చంద్ర‌బాబుకు ప‌ని పెంచేసింది. మ‌ళ్లీ వారందిరినీ ఆహ్వానించాలి. వారిలో న‌మ్మ‌కం క‌లిగించాలి. అంతేకాదు.. వ‌చ్చేనాలుగేళ్ల‌లో ఎవ‌రూ అమ‌రావ‌తిని క‌ద‌లించ‌లేర‌న్న విధంగా ఆయ‌న దూకుడు నిర్ణ‌యాలు తీసుకోవాలి. నిధులు తీసుకురావాలి.. సో.. ఇవ‌న్నీ చూసుకుంటే.. చంద్ర‌బాబు ఇప్పుడు చేస్తున్న 18 గంట‌ల ప‌ని స‌రిపోయేలా లేదు. మ‌రో రెండు గంట‌ల‌పాటు పెంచుకోవాల్సిందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.