Begin typing your search above and press return to search.

గెలుపు మర్యాద ఇలానే ఉంటాది మరి: మోడీ పక్క కుర్చీలో బాబు

ఢిల్లీకి వెళ్లి తనకు ఎదురవుతున్న కష్టం గురించి.. ఏపీకి జరుగుతున్న నష్టం గురించి మాట్లాడటానికి వెళితే.. అపాయింట్ మెంట్ కూడా రాని పరిస్థితి.

By:  Tupaki Desk   |   6 Jun 2024 4:17 AM GMT
గెలుపు మర్యాద ఇలానే ఉంటాది మరి: మోడీ పక్క కుర్చీలో బాబు
X

ఢిల్లీకి వెళ్లి తనకు ఎదురవుతున్న కష్టం గురించి.. ఏపీకి జరుగుతున్న నష్టం గురించి మాట్లాడటానికి వెళితే.. అపాయింట్ మెంట్ కూడా రాని పరిస్థితి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి.. ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్నా.. తనకు లభించాల్సిన సాదాసీదా మర్యాదలకు కూడా నోచుకోని గడ్డు పరిస్థితుల్ని చంద్రబాబు గడిచిన ఐదేళ్లలో పలుమార్లు ఎదుర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లి.. మోడీ దర్శనం కోసం.. ఆయన ఇచ్చే టైం కోసం ఎదురు చూసిన గంటలు అన్ని ఇన్ని కావు. అయినప్పటికి ఆయన అనుకున్నది జరగక.. ఏమీ చేయలేక గమ్మున ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేయటం తప్పించి ఇంకేమీ చేయలేని పరిస్థితి ఉండేది.


అలాంటి చంద్రబాబు దశ ఇప్పుడు పూర్తిగా మారింది. తాజాగా వెల్లడైన ఫలితాలతో ఆయన సాధించిన ఘన విజయం.. తాజాగా ఆయన చేతిలో ఉన్న ఎంపీల సంఖ్య ఆయన గౌరవ మర్యాల్ని పూర్తిగా మార్చేసింది. స్కిల్ స్కాం పేరుతో జైలుకు పంపిన వేళ.. బెయిల్ కోసం ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. దశాబ్దాల తరబడి తాను విస్తరించిన నెట్ వర్కు మొత్తాన్ని యాక్టివ్ చేసినా.. జైలు నుంచి బయటకు రావటానికి ఆయనకు కాసింత టైం తప్పలేదు.

ఆ సందర్భంలో ఆయన శరీరం సహకరించకపోగా.. జైలు జీవితం పెట్టే కఠిన పరీక్షలతో బాబు ఒంటికి తీవ్రమైన అసౌకర్యం కలుగుతున్నా.. ఎవరూ స్పందించని తీరు చూశాక ఏపీ ప్రజల్లోనే కాదు.. యావత్ తెలుగు వారిలో కోపం కట్టలు తెంచుకుంది. రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవటం సరే.. కానీ ఈ వయసులో ఉన్న సీనియర్ నేతకు ఇంత శిక్ష వేయటం అవసరమా? అన్న భావన చాలామందిలో కలిగింది. అదే..ఆయనపై సానుభూతిని పెంచటమే కాదు.. ఆయన మీద పొంగిన ప్రేమాభిమానాలకు నిదర్శనంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో వచ్చిన స్పందనను మర్చిపోలేం.

ఏపీ విపక్ష నేతగా చంద్రబాబుకు ఢిల్లీలో ఎదురైన ఎదురుదెబ్బలు అన్నిఇన్ని కావు. అన్నింటికి లెక్కలు సరి చేసేందుకు వీలుగా కాలం ఆయన పక్షాన చేరిందిప్పుడు. ఇంతకాలం కాలపరీక్షకు గురి చేసిన దానికి బదులుగా.. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. మొన్నటివరకు మోడీ అపాయింట్ మెంట్ కోసం నానా తిప్పలు పడే పరిస్థితి నుంచి.. ఇప్పుడు సగౌరంగా అదే మోడీ పక్కన కూర్చొనే వరకు విషయం వెళ్లింది. తాజా ఎన్డీయే పక్ష సమావేశంలో మోడీకి ఓపక్కన టబీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఉంటే.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు.

ఈ సమావేశానికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో క్లిప్పుల్ని చూస్తే.. చంద్రబాబుతో కులాసాగా మాట్లాడే మోడీ కనిపిస్తారు. గతంలో మాదిరి ఇలాంటి తీరుకు పొంగిపోయే చంద్రబాబు ఈసారి మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్న తీరును నోట్ చేసుకోవాల్సిందే. ఇదంతా చూసినోళ్లు.. మొన్నటివరకు మోడీ అపాయింట్ మెంట్ కోసం విపరీతంగా శ్రమించిన చంద్రబాబుకు ఇప్పుడు సీన్ మారిపోవటమే కాదు.. ఎప్పుడు కావాలంటే అప్పడు మోడీ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నట్లుగా పరిస్థితులు మారిపోవటం గమనార్హం.