Begin typing your search above and press return to search.

బాబు మార్కు మార్పు... భారీగా ఐఏఎస్ లు బదిలీ... శ్రీలక్ష్మి సంగతి?

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ లతో బాబు భేటీ అయిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   20 Jun 2024 4:03 AM GMT
బాబు మార్కు మార్పు... భారీగా ఐఏఎస్ లు బదిలీ... శ్రీలక్ష్మి సంగతి?
X

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ లతో బాబు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లపై బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే అది కేవలం మాటలకే పరిమితం కాలేదు.. చేతల్లోనూ చూపించారు. అధికార యంత్రాంగంలో తన మార్కు ప్రక్షాళన ప్రారంభించారు.

అవును... ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం గత ప్రభుత్వ హయాంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ క్రమంలో తాజాగా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేశారు. మరికొందరికి కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు.

ఇదే సమయంలో... గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పద అధికారులుగా ముద్రపడిన వారికి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు వైరల్ గా మారాయి. ఇందులో భాగంగా... కీలక శాఖల కార్యదర్శులు, డిపార్ట్ మెంట్స్ హెడ్ లుగా ఉన్న 21 మంది అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో ప్రధానంగా... పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మీ, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, వైద్య సేవలు - మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ మురళీధర్ రెడ్డిలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ చేయాలని సీఎస్ అదేశించారు.

ఈ క్రమంలో మరో రెండు మూడు రోజుల్లో మరికొంతమంది కార్యదర్శులు, డిపార్ట్మెంట్స్ హెడ్ ల బదిలీలు జరగనున్నాయని అంటున్నారు. అదేవిధంగా ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉండబోతున్నాయని చెబుతున్నారు. వీటితోపాటు జిల్లల కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం మార్చనుందని అంటున్నారు.

కాగా... ఇటీవల సచివాలయంలో జరిగిన మీట్ & గ్రీట్ కార్యక్రమంలో ఐఏఎస్ శ్రీలక్ష్మీ నుంచి పుష్పగుచ్ఛం తీసుకోవడానికి కూడా చంద్రబాబు విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.