Begin typing your search above and press return to search.

ఉచిత‌నుచితాలు.. ఏపీలో ఉచిత బ‌స్సుపై ఏం చేస్తారు?

ఉచితాలు ప్ర‌క‌టించ‌డం తేలిక‌. కానీ, వాటిని నెర‌వేర్చ‌డ‌మే క‌ష్టం.

By:  Tupaki Desk   |   28 July 2024 10:07 AM GMT
ఉచిత‌నుచితాలు.. ఏపీలో ఉచిత బ‌స్సుపై ఏం చేస్తారు?
X

ఉచితాలు ప్ర‌క‌టించ‌డం తేలిక‌. కానీ, వాటిని నెర‌వేర్చ‌డ‌మే క‌ష్టం. దీనికి ఎంతో క‌ష్ట‌ప‌డితే త‌ప్ప‌.. అమ‌లు చేయ‌లేని పరిస్థితి ఏర్ప‌డింది. ఈ విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అప్పులు చూస్తే.. భ‌య‌మేస్తోంద‌ని, మ‌రోవైపు సూప‌ర్ సిక్స్ పరిస్థితి అర్ధం కావ‌డం లేద‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన కీల‌క‌ప‌థ‌కాల్లో కొన్నింటినైనా అమ‌లు చేయాల్సిన ప‌రిస్తితి ఇప్పు డు ఏర్ప‌డింది. లేక పోతే.. ప్ర‌జ‌ల్లో ఒకింత అసంతృప్తి ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంది.

ప్ర‌బుత్వం ఏర్ప‌డి 50 రోజుల అయిపోయిన నేప‌థ్యంలో ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం ప‌థ‌కం మ‌హిళా మ‌ణుల‌ను ఊరిస్తోంది. ఈ ప‌థ‌కం కోస‌మేనా అన్న‌ట్టుగా కొన్నికొన్ని జిల్లాల్లో మ‌హిళ‌ల ఓట్లు కూట‌మికి ప‌డ్డాయి. ఇక‌, ఇప్ప‌టికీ ఈ ప‌థ‌కం అమ‌లు చేయ‌క‌పోతే.. ఇబ్బందేన‌ని భావిస్తున్న టీడీపీ.. సాధ్య‌మైనంత వేగంగా ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా ఇప్ప‌టికే ఈ ప‌థ‌కం అమ‌ల‌వుతున్న త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌ల‌లో ప‌రిస్థితిని అధ్య‌యం చేసింది.

ఈ లెక్క ప్ర‌కారం.. రాష్ట్రంలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని అమ‌లు చేసేందుకు క‌నీసంలో క‌నీసం నెల‌కు 250 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా వేశారు. ఇంకా ఇది పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆఫీసుల‌కు త‌మ త‌మ వాహ‌నాల‌పై వెళ్లిన మ‌హిళ‌లు, ప్రైవేటు వాహ‌నాల్లో వెళ్లిన‌వారు కూడా.. ఇప్పుడు ఉచితం అనేస‌రికి ఆర్టీసీని ఆశ్ర‌యించినా ఆశ్చ‌ర్యం లేదు. ఈ నేప‌థ్యంలో మ‌రో 100 కోట్ల‌యినా.. ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. దీనిని ఎలా స‌మీక‌రించాల‌నే అంశం స‌ర్కారుకు ఇబ్బందిగా మారింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏం జ‌రుగుతోంది?

+ వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసింది.

+ ఫ‌లితంగా ఆర్టీసీకి వ‌చ్చే లాభ‌న‌ష్టాల‌తో సంబంధం లేకుండా.. స‌ర్కారే ఉద్యోగుల‌కు, అధికారుల‌కు కూడా జీతాలు చెల్లించింది.

+ ఇక‌, డీజిల్ ఖ‌ర్చు మాత్ర‌మే ఆర్టీసీ భ‌రించేంది. చిన్న‌పాటి రిపేర్లు, టైర్ల మార్పువంటివి కూడా చూసుకు నేది. కొన్ని చోట్ల కార్యాల‌యాల‌కు అద్దెలు చెల్లించేది.

+ ఇదేస‌మ‌యంలో స‌ర్కారుకు రూ.120 కోట్ల మేర‌కు ప‌న్నులు.. ఇత‌ర‌త్రా ర‌శీదుల పేరుతో నిధులు చెల్లించేది.

+ అయితే.. ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆదాయాన్ని పెంచేప్ర‌య‌త్నం చేయ‌డం ద్వారా.. ఈ ఉచిత ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తారో.. లేక ఏం చేస్తారో చూడాలి.