హామీల 'ఉట్టి' అందేనా?.. బాబుకు.. ప్రజలకు టెన్షనే.. !
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఉట్టి కొట్టడం అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 26 Aug 2024 3:30 PM GMTశ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఉట్టి కొట్టడం అందరికీ తెలిసిందే. దీనిని శ్రీకృష్ణుడి లీలల్లో ఒకటి గా చెబుతారు. చిన్నతనంలో శ్రీకృష్ణుడు.. వెన్నకోసం.. చేసిన ప్రయత్నం.. ఈ ప్రయత్నంలో ఎదురైన సవాళ్లు.. ఉట్టిమీద ఉంచిన వెన్నను చేజిక్కించుకునేందుకు చేసిన ప్రయత్నం వంటివే ఉట్టి రూపంలో దేశంలో చాలా చోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ``అందని దానిని అందుకు నేందుకు చేసే ప్రయత్నమే ఉట్టి కొట్టడం``
ఇక, రాజకీయ `ఉట్టి` విషయానికి వస్తే.. పదవులు అందుతాయో లేదో అనే బెంగతో అనేక మంది నాయకు లు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే..ఇప్పుడు హామీల `ఉట్టి` ఆసక్తిగా మారింది. ఇది రెండు రకాలుగా చర్చకు వస్తున్న విషయం గమనార్హం. దీనిలో చంద్రబాబు హామీల ఉట్టి వేరు.. ప్రజల హామీల ఉట్టి వేరు. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజం. ప్రజలు చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీల కోసం ఎదురు చూస్తున్నారు.
ఇదే సమయంలో చంద్రబాబు .. కేంద్రంలోని మోడీ సర్కారు తనకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వేచి ఉన్నారు. ఇద్దరిదీ ఒక్కటే వేదన.. `హామీల ఉట్టి` కొట్టడమే. కాకపోతే.. ఎవరి ప్రాధాన్యాలు వారి వి. అమరావతి కోసం బడ్జెట్లో ప్రకటించిన రూ.15 వేల కోట్ల హామీ ఎప్పుడు నెరవేరుతుందా? అని చంద్ర బాబు ఎదురు చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకు డబ్బులు ఎప్పుడు ఇస్తారా? అని మరో ఎదురు చూపు. వెనుక బడిన జిల్లాలకు నిధులు కూడా ఈ హామీల ఉట్టిలోనే ఉన్నాయి.
ఇక, ప్రజల విషయానికి వస్తే.. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారా? అని వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం.. గ్యాస్ బండలు, ఆడబిడ్డ నిధి.. వంటివి హామీల ఉట్టి ఎప్పుడు అందుతుందా? ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొత్తంగా హామీల ఉట్టి.. అందరికీ కామనే. దీనిని కొట్టాలనే లక్ష్యం కూడా కామనే. అయితే.. ఇది అందడమే కష్టంగా మారింది.