వావ్.. చంద్రబాబులో ఇంత ఎనర్జీనా?
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. యావత్ భారతం ఎండలతో మండిపోతోంది.
By: Tupaki Desk | 7 May 2024 6:30 AM GMTరెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. యావత్ భారతం ఎండలతో మండిపోతోంది. ఉదయం ఏడు దాటితే చాలు.. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. రాత్రి అయ్యేసరికి అంతో ఇంతో చల్లదనంతో కాసింత సేద తీరటానికి వీలుండేది. గడిచిన కొద్దిరోజులుగా భానుడి ప్రతాపానికి వేడెక్కిపోయిన వాతావరణం అర్థరాత్రి వేళలోనూ వేడి కంటిన్యూ అవుతోంది. దీంతో.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరోనా తర్వాతి కాలంలో ఇంతటి ఎండల్ని చూసింది ఇప్పుడే.
ఇంతటి వేడిలో రోజువారీ పనులే చేయలేని పరిస్థితి. ఎండకు దడిచి.. ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిన పనుల్లో కొంతమేర మాత్రమే చేస్తూ.. మిగిలినవి వాయిదా వేసుకుంటున్న వారెందరో. ఇంతటి ప్రతికూల వాతావరణంలో ఎన్నికలు రావటం.. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేయాల్సిన రావటంతో నేతలు.. అధినేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వేళలో.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పార్టీ అధినేతలు మొత్తం ఒకే తీరును ప్రదర్శిస్తున్నారు. అందుకు మినహాయింపు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రమే.
ఎన్నికల వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల వేళ.. వీళ్లు వాళ్లు అన్న తేడా లేకుండా అధినేతలు.. నేతలు.. అభ్యర్థులు అంతా ఒకలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు. ఉదయం 10 గంటల్లోపు ఏదో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేయటం.. ఆ తర్వాత సేద తీరటం.. మధ్యాహ్న వేళలో రివ్యూలు చేయటం.. సాయంత్రం ఐదు గంటలకు ప్రచారాన్ని మొదలుపెట్టి రాత్రి పది గంటల వరకు కంటిన్యూ చేస్తున్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్.. ఉప ముఖ్యమంత్రి భట్టి.. పార్టీకి చెందిన మంత్రులు.. విపక్ష నేత కేసీఆర్.. ఆ పార్టీకి చెందిన కేటీఆర్.. హరీశ్ రావులతో పాటు.. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ ఆ పార్టీకి చెందిన బండి సంజయ్ మొదలు కీలక అభ్యర్థులు.. ఇతర రాష్ట్రాల నుంచి కాంగ్రెస్.. బీజేపీ తరఫున ప్రచారం చేయటానికి వచ్చిన ప్రముఖలంతా కూడా ఉదయం.. సాయంత్రం వేళలోనే ప్రచారం చేస్తున్న పరిస్థితి.
ఏపీ విషయానికి వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు.. విపక్ష నేత చంద్రబాబు. ఆయన పార్టీ నేతలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్. బీజేపీకి చెందిన ముఖ్యులు.. ఇలా అన్ని పార్టీల వారిని చూసినప్పుడు.. వీరందరిలోనూ వయసులో పెద్ద అయిన ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా శ్రమిస్తున్నారు.
పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏ టైంలో అయినా సరే.. మంట మండే ఎండల్లోనూ ఆయన అదే ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం.. రోజుకు ఒక్క ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నారు. కేసీఆర్ సైతం అదే తీరుతో ఉన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం సాయంత్రం వేళలో.. రెండు.. మూడు కార్నర్ మీటింగ్ లతో దూసుకెళుతున్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఉదయం.. సాయంత్రాలు రెండు వేళల్లోనూ ప్రచారాన్నినిర్వహిస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల అధినేతలు.. నేతల్ని చూసినప్పుడు వారందరిలోనూ వయసులో పెద్దోడైన చంద్రబాబు మాత్రం అపరిమితమైన ఎనర్జీతో దూసుకెళుతున్నారు. వయసును మాత్రమే చూసినప్పుడు.. ఆయన రాజకీయ ప్రత్యర్థులు అన్నట్లు ‘‘చంద్రబాబు ముసలోడే’’. కానీ.. ఆయన ఎనర్జీలను పరిగణలోకి తీసుకుంటే.. ఎంతోమంది యువకులు.. మధ్యవయస్కుల కన్నా మిన్నగా కనిపిస్తారని చెప్పక తప్పదు.