అమరావతి కోసం అతివలు కదిలిన వేళ!
ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల ఉదారతను చంద్రబాబు అభినందించారు.
By: Tupaki Desk | 26 Jun 2024 9:30 AM GMT''ఏపీ రాజధాని అమరావతి ప్రాధాన్యం ప్రజలు గుర్తించారు. గత పాలకులు దీనిని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసినా.. ప్రజలే కాపాడుకున్నారు'' అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాజాగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం.. చిత్తూరు జిల్లాలోని డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు భారీ విరాళం చంద్రబాబు అందించారు. మొత్తం రూ.4.5 కోట్ల విరాళం అందజేశారు. కుప్పం బహిరంగ సభలో సంబంధిత చెక్కును మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల ఉదారతను చంద్రబాబు అభినందించారు. అదే సభలో మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్టు తరఫున మరో రూ.కోటి విరాళంగా ఇచ్చారు.
ఆది నుంచి అతివలే!
అమరావతి నిర్మాణం సాకారం కావడంలో అతివలదే కీలక పాత్ర ఉంది. చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడు నిధుల కోసం అనేక మంది మహిళలు ఒంటి మీద ఉన్న బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. మరికొందరు మహిళలు.. తమకు పసుపుకుంకాల కింద ఇచ్చిన ఆస్తిని కూడా అమ్మేసి ఆ సొమ్మును రాజధానికోసం ప్రత్యేకంగా తెరిచిన ఖాతాల్లో వేశారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియాల నుంచి కూడా వచ్చిన మహిళలు.. అప్పట్లో రాజదాని కోసం.. తమ ఒక నెల వేతనాన్ని అందించిన విషయం గుర్తుండే ఉంటుంది.
కేవలం విరాళం ఇవ్వడమే కాదు.. రాజధాని అమరావతిని గుర్తించకుండా.. మూడు రాజధానులు అంటూ.. వైసీపీ సర్కారు చేసిన మూడు ముక్కలాటపైనా అతివలే అలుపెరుగని పోరాటం చేశారు. రైతు కూలీలు, మహిళా రైతులు కూడా.. అమరావతి సాధన కోసం ఉద్యమించారు. రోజుల పాటు పాదయాత్ర చేశారు. పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నారు. బెజవాడ దుర్గమ్మకు మొక్కుకున్నారు. తిరుమల శ్రీవారికి దణ్ణాలు పెట్టుకున్నారు. ఆ నాడు అమరావతి కడుతున్నామంటే.. కదిలిన మహిళలే .. అమరావతిని కూలుస్తున్నామని ప్రకటించగానే.. ఉగ్ర రూపం దాల్చి వైసీపీని ఇంటికి పంపించారు.
ఇక, ఇప్పుడు ఆ మహిళలే ఒక్కొక్క చేయి వేసి.. రాజధాని నిర్మాణానికి ముందుకు రావడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. అమరావతి నిర్మాణం.. కల సాకారం వెనుక.. అతివల పాత్ర అనిర్వచనీయం అనడంలో సందేహం లేదు.