ఉంచాలా.. తీసేయాలా? బాబుకు టెన్షన్!
ఇలాంటి వాటిలో కీలకంగా ఉంది 'ఇంటింటికి రేషన్'. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటింటికి రేషన్ పంపిణీ అవుతోంది. వాహనాల ద్వారా రేషన్‌ను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు.
By: Tupaki Desk | 6 Aug 2024 2:13 PM GMTఏపీలో కూటమి ప్రభుత్వంపై తన ముద్రపడేలా చూసుకోవాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. ఇది మంచిదే. ఆయన ముద్ర పడాల్సిందే. ఎవరూ కాదనరు. ఎందుకంటే బాబు బ్రాండ్ ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. అభివృద్ధి పథంలో నడుస్తుంది. విజన్ 2047 వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా వెలుగు చూస్తాయి. కాబట్టి ఆయన ముద్రను అందరు కోరుకుంటారు. అయితే, ఇక్కడ సమస్య ఏంటంటే బాబు బ్రాండ్ లేదా తనదైన పాలన సంస్కరణల పేరుతో కొన్ని కొన్ని పథకాలను తీసేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఇబ్బందిగా మారింది.
ఏ ప్రభుత్వం వచ్చినా పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఆయా ప్రభుత్వాలు వేసే అడుగులు కొంత వ్యతిరేకతను పెంచుతాయి. ఇలాంటి పరిణామాలు వైసిపి హయాంలో మనకు స్పష్టంగా కనిపించాయి. ఉదాహరణకు 'అన్న క్యాంటీన్' 2019 ఎన్నికలకు ముందే ప్రారంభించినప్పటికీ ప్రజలకు బాగా చేరువైంది. ముఖ్యంగా రక్షా కార్మికులు, ఆటో కార్మికులు, ఉద్యోగులు హాకర్లు ఇలా అనేకమంది ఐదు రూపాయలకే భోజనం చేయటం వల్ల వారికి ఎంతో మేలు జరిగింది. అయితే.. వైసీపీ వచ్చాక దీనిని తీసేసింది.
ఇది ప్రజల్లో ముఖ్యంగా ఆయా వర్గాల్లో వైసిపిపై వ్యతిరేక భావనను పెంచేలా చేసింది. ఇలా ప్రజలతో ముడిపడిన కొన్ని పథకాలు తీసేయడం అనేది కొంత ఇబ్బందికర పరిణామం. అది జగన్ అయినా.. ఇప్పుడు చంద్రబాబు అయినా ఎవరికైనా వర్తించే సూత్రం. ఇలాంటి వాటిలో కీలకంగా ఉంది 'ఇంటింటికి రేషన్'. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటింటికి రేషన్ పంపిణీ అవుతోంది. వాహనాల ద్వారా రేషన్‌ను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు.
అయితే తాజాగా వచ్చే నెల నుంచి దీన్ని నిలిపివేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని వలన నష్టం జరుగుతోందని అంటున్నారు. ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చేసిన వ్యవస్థ. గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజలు దీనిని అందుకుంటున్నారు. ఇప్పుడు కూడా అందుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాటిని తీసేసే విషయంలో కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ వాహనాలపై ఆధారపడి రాష్ట్రంలో సుమారు 40 వేల మంది యువత డ్రైవర్లుగాను మరో 40 వేల మంది అటెండర్లు గాను ఉన్నారు.
వాహనాలు ఆపేస్తే.. వీరి పరిస్థితి కూడా ఇబ్బందిలో పడే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా సచివాలయ వ్యవస్థ వైసిపి తీసుకొచ్చిన కీలక వ్యవస్థ. ఇది ప్రజలకు బాగా చేరువైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలకు ఏం కావాలన్నా, ఎలాంటి సర్టిఫికెట్లు అవసరమైనా ప్రభుత్వానికి సంబంధించి ఏ పని చేయాలన్నా కూడా ఏ పని కావాలన్నా కూడా సచివాలయాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు వీటిని ఎత్తేస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తడంతోపాటు అవినీతి పెరుగుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. అందుకే.. కొన్ని కొన్ని విషయాల్లో ఆచి తూచి వ్యవహరిస్తే మేలనే సూచనలు వినిపిస్తున్నాయి.