Begin typing your search above and press return to search.

జగన్ బెదిరిస్తే ఇక్కడ ఎవరూ బెదిరిపోరు!

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో జగన్ పై బాబు ఘాటుగా స్పందించారు.

By:  Tupaki Desk   |   9 July 2024 2:50 PM GMT
జగన్  బెదిరిస్తే ఇక్కడ ఎవరూ బెదిరిపోరు!
X

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలను, నేటి రాష్ట్ర పరిస్థితిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో జగన్ పై బాబు ఘాటుగా స్పందించారు.

అవును... ఏపీలో గత ఐదేళ్లలో విద్యుత్ రంగం ఏ స్థాయిలో దిగజారిందనే విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని.. గతంలో తమ హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని.. 2014-19లో సౌరశక్తి, పవన విద్యుత్ శక్తిలను పెంచామని అన్నారు.

అదేవిధంగా... 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగిందని.. తమ ప్రభుత్వ హయాంలో 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరేలా కృషి చేశామని.. తమ హయాంలోనే ట్రాన్స్ కో, జెన్ కో లకు అవార్డులు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే గత ఐదేళ్లలో మాత్రం ప్రజలపై రూ.32,166 కోట్ల ఛార్జీల భారం మోపారని, రూ.49,596 కోట్ల అప్పులు చేశారని తెలిపారు.

ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ములాకత్ లంటూ జైళ్ల వద్దకు వెళ్లి పదే పదే బెదిరింపులు చేస్తున్నారంటూ ఎదురైన ప్రశ్నకు బాబు ఆసక్తికరంగా స్పందించారు. ఇందులో భాగంగా... రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి, రాష్ట్రాన్ని లూటీ చేసి, ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ ప్రైవింగ్ ఇచ్చేసి, వ్యవస్థలకే ఒక ఛాలెంజింగ్ గా తయారైపోయారని అన్నారు.

ఇది కూడా ఇప్పుడు తనకు ఓ సమస్యగా మారిందని బాబు తెలిపారు. ఐదేళ్లు సంపాదించిన డబ్బులు ఉన్నాయి.. ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది.. వాటిని కొనే పరిస్థితికి కూడా వస్తారని అన్నారు. అందువల్లే రూ.200, రూ.500 నోట్లు రద్దు చేయమని తాను బ్యాంకర్స్ కి చెప్పానని, ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయమని చెప్పినట్లు బాబు వెల్లడించారు.

ఈ సమయంలోనే... ఎవరు ఎన్ని అరిచినా, బెదిరింపులకు దిగినా, నేరస్తులెవ్వరూ తప్పించుకోలేరని.. అవినీతిపరులు తప్పించుకోలేరని.. ఎక్కడా రాజీపడే ప్రసక్తి లేదని.. ఈ ప్రభుత్వం ఎవరికీ భయపడదని.. సిటమెటిక్ గా ఉంటుందని.. రాజకీయ ముసుగులో ఎవరు బెదిరింపులకు పాల్పడినా ప్రభుత్వం బయపడదని అన్నారు.