పదవి ప్లీజ్.. బాబుకు అసలు పాట్లు స్టార్ట్ అయ్యాయ్..?
వీరిని స్థానికంగా ఉన్న నాయకులు కలుసుకుని.. పదవుల కోసం మొర పెడుతున్నారు.
By: Tupaki Desk | 3 July 2024 3:00 AM GMTప్రస్తుతం చంద్రబాబు ఆదేశాల మేరకు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా.. వారి వారి నియోజకవర్గా ల్లో ఉంటున్నారు. జూలై 1న వారి వారి నియోజకవర్గాల్లో.. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో వారంతా ఢిల్లీలు వదిలి గల్లీలకు చేరుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఇప్పుడు వీరికి అసలు సమస్య వెంటాడుతోంది. వీరిని స్థానికంగా ఉన్న నాయకులు కలుసుకుని.. పదవుల కోసం మొర పెడుతున్నారు. మాకంటే మాకేనని వారు పదవుల కోసం వెంటాడుతున్నారు.
విజయవాడకు చాలా మంది నాయకులు.. జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర వద్దకు క్యూ కట్టారు. ఇక, మచిలీపట్నంలోని వారికి లెక్కేలేదు. అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దగ్గరకు మరికొందరు నేతలు క్యూకట్టారు. కార్పొరేషన్లు.. సామాజిక వర్గాలకు చెందిన పదవుల కోసం వీరంతా సిఫారసుల బాట పట్టారు. ఎంపీలు.. ఎమ్మెల్యలు.. మంత్రులు ఇలా.. నియోజకవర్గాల్లో ఎవరు కనిపిస్తే.. వారిని బ్రతిమాలుకుంటున్నారు. గతంలో తాము పార్టీకి ఎలాంటి సేవ చేసిందీ వారు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు పదవులు ఇప్పించాలంటూ కోరుతున్నారు.
ఇక, మరికొందరైతే.. వైసీపీ హయాంలో తాము ఎలా పోరాడిందీ చెబుతున్నారు. అప్పట్లో తమపై నమోదైన కేసుల చిట్టాను కూడా.. విప్పుతున్నారు. ఇన్నిన్ని కేసులు పెట్టించుకున్నాం.. మాకు పదవులు ఇస్తారని ఆశపడుతున్నామని మొహం మీదే చెబుతున్నారు. దీంతో నాయకులు.. మంత్రులకు.. వీరిని కాదనలేక.. ఔననలేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అంతేకాదు.. దీనిపై ఎలాంటి హామీ కూడా వారు ఇవ్వలేక పోతున్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల విషయం చంద్రబాబు పరిశీలనలో ఉందని మాత్రం చెప్పి పంపిస్తున్నారు.
ఇక, క్షేత్రస్తాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. అధినేత చంద్రబాబు దగ్గర మాత్రం ఆప్షన్లు వేరేగా ఉన్నాయని తెలుస్తోంది. ముందుగా.. టికెట్లు దక్కని వారిని అవకాశం ఇచ్చి.. వారిని సంతృప్తి పరచాలని చంద్రబాబు భావిస్తున్నారు. వీరి సంఖ్యే 30 వరకు ఉందని తెలుస్తోంది. ఎందుకంటే.. జనసేనకు 21, బీజేపీకి 10 సీట్లు ఇచ్చారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి తీరాలి. ఇవి కాకుండా.. మరికొందరు.. తమ సీట్లను సొంత పార్టీ వారికే త్యాగం చేశారు. దీంతో వీరు కూడా.. ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిని కూడా తృప్తి పరిచిన తర్వాత కానీ.. మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఆలోచించే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది.