'పర్సనల్ లోన్'.. భారం పెంచుకుంటున్న చంద్రబాబు!
రాష్ట్రంలోని దాదాపు అర కోటి మంది మహిళలతో ఏర్పడిన డ్వాక్రా గ్రూపులకు పర్సనల్ రుణాలు ఇచ్చేందు కు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
By: Tupaki Desk | 19 July 2024 10:00 AM GMTరాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉంది. అనేక రూపాల్లో పెట్టుబడులకు మధ్యవర్తిగా బ్యాంకుల నుంచి పలు సంస్థలకు అప్పులు ఇప్పించింది. దీనికి సంబంధించి ఎవరైనా చేతులు ఎత్తేస్తే.. సర్కారే ఆ మొత్తాలను చెల్లించాలి. ఇది... గతంలో వైసీపీ సర్కారు చేసిన వ్యవహారం. కానీ, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాటలో వెళ్తున్నారా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. మహిళా ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవాలని అనుకున్నారో.. లేక.. వైసీపీ కంటే ఎక్కువగా మహిళలకు మేలు చేశామన్న పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నించారో.. ఏదేమైనా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని దాదాపు అర కోటి మంది మహిళలతో ఏర్పడిన డ్వాక్రా గ్రూపులకు పర్సనల్ రుణాలు ఇచ్చేందు కు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీనికి సర్కారు గ్యారెంటీ ఉండనుంది. అంటే.. వాస్తవానికి గ్రూపులకు ఇచ్చే సొమ్ములు వేరు. ఇది.. వ్యక్తిగత రుణం. అంటే.. డ్వాక్రా గ్రూపులో సభ్యత్వం ఉంటే.. గ్రూపు ద్వారా అందే రుణం వేరుగా ఉంటుంది.. వ్యక్తిగతంగా ఇచ్చే రుణం వేరుగా ఉంటుంది. వ్యక్తిగత రుణాలకు సర్కారు గ్యారెంటీ ఉంటుంది. తద్వారా బ్యాంకులు మహిళలకు పర్సనల్ లోన్లు ఇస్తాయి.
ఇది మంచిదేనా? అంటే.. నాణేనికి ఒకవైపు చూస్తే.. మంచిదే అనిపిస్తుంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఏటా వడ్డీ మాఫీ చేస్తున్నారు. అంటే.. కేవలం వారు కట్టేది అసలే. ప్రభుత్వా నికి ఇది భారంగా మారింది. ఇప్పుడు కొత్తగా పర్సనల్ రుణాల వ్యవహారం తెరమీదికి వస్తే.. రేపు తీసుకు న్న వారు కట్టకపోతే.. మరింత భారం సర్కారు మోయాల్సి ఉంటుంది. అప్పుడు గ్రూపులకే ఇబ్బంది వచ్చినా ఆశ్చర్యం లేదు. సో.. ఇలాంటి ఆర్థిక భారం మోసేముందే ఆలోచించుకుంటే బెటర్ అంటున్నా రు పరిశీలకులు.
ఎవరెవరికి ఎంతెంత?
డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు లక్ష నుంచి 5 లక్షల వరకూ బ్యాంకుల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో వ్యక్తిగత రుణాలు ఇస్తారు. ఒకేసారి ముగ్గురికి లక్ష నుంచి 5 లక్షల వరకూ ఈ పర్సనల్ లోన్ అందుతుంది. ఈ సంవత్సరంలో 2 వేల కోట్ల వరకూ మహిళలకు పర్సనల్ లోన్లు ఇప్పించనున్నారు. ఇలా మొత్తం లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు లోన్లు ఇప్పించనున్నారు. దీనిలో లక్షా 35 వేల మందికి లక్ష రూపాయల చొప్పున, మిగిలిన 15 వేల మందికి 5 లక్షల చొప్పున లోన్లు ఇప్పిస్తారు. అయితే.. ఈ రుణాన్ని మహిళలు చెల్లిస్తే ఫర్వాలేదు. లేకపోతే.. సర్కారుకు గుదిబండ అవుతుందనేది ఆర్థిక నిపుణుల మాట.