Begin typing your search above and press return to search.

బాబు సుదీర్ఘ ప్రయాణం.. జైలు నుంచి విజయవాడకు 12 గంటలు

రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు చేరుకోవటానికి ఆయన కాన్వాయ్ కు 12 గంటలు పట్టటం గమనార్హం.

By:  Tupaki Desk   |   1 Nov 2023 4:09 AM GMT
బాబు సుదీర్ఘ ప్రయాణం.. జైలు నుంచి విజయవాడకు 12 గంటలు
X

స్కిల్ స్కాం ఆరోపణలతో 52 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాుబకు ఏపీ హైకోర్టు తాత్కాలిక బెయిల్ ఇవ్వటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని జైలు నుంచి మధ్యాహ్న వేళలో బయటకు వచ్చారు.

జైలు నుంచి తన కాన్వాయ్ లో బెజవాడకు సమీపంలోని ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు కాన్వాయ్ విపరీతమైన ఆలస్యంతో ముందుకు వెళ్లటం గమనార్హం.

ఎందుకిలా? అన్నది చూస్తే.. చంద్రబాబును చూసేందుకు ప్రతి గ్రామం.. ప్రతి పల్లెలోనూ.. ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకు రావటం.. విపరీతమైన జన సందోహంతో ఆయన ప్రయాణం తీవ్రమైన ఆలస్యం చోటు చేసుకుంది. దీంతో.. ఆయన ప్రయాణం చాలా నెమ్మదిగా సాగింది. రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు చేరుకోవటానికి ఆయన కాన్వాయ్ కు 12 గంటలు పట్టటం గమనార్హం.

మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు జైల నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు వాహనశ్రేణి.. విజయవాడ నగరంలోని ప్రవేశించే సమయానికి అర్థరాత్రి 2.45 గంటలైంది. ఇంతసేపు ఎందుకు పట్టిందన్న చంద్రబాబుకు.. జనసందోహం పెద్ద ఎత్తున ఉండటంతో ఆలస్యమైందని.. ప్రజల్ని నియంత్రించే విషయంలో ఏ మాత్రం పొరపాటు దొర్లినా శాంతిభద్రతల సమస్య వాటిల్లుతుందని చెప్పినట్లుగా తెలిసింది.

చంద్రబాబును చూసేందుకు దారివెంట మొత్తం రోడ్ల మీదకు వచ్చిన ప్రజలు.. పూలు జల్లుతూ స్వాగతం పలికారు. కోర్టు నిబంధనలకు లోబడే చంద్రబాబు కాన్వాయ్ నడిచిందని.. ఎక్కడా రాజకీయ యాత్ర చేపట్టలేదని వివరణ ఇవ్వటం గమనార్హం. వేలాదిగా ప్రజలు తరలి వచ్చినా.. ఆయన ఎక్కడా వాహనం దిగలేదన్నారు. చంద్రబాబు కాన్వాయ్ వెంట మరే వాహనానికి అనుమతి ఇవ్వొద్దని.. పోలీసులకు తాము తెలిపినట్లుగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు వెల్లడించారు.