'జన్మభూమి'కి జేజేలు.. బాబు మరో ట్రెండ్ ..!
టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. గతంలో తను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొనసాగించినా
By: Tupaki Desk | 9 Aug 2024 5:30 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. గతంలో తను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొనసాగించినా.. జన్మభూమి కమిటీలను తిరిగి తీసుకువస్తున్నట్టు ఆయన ప్రకటించా రు. తాజాగా జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో జన్మభూమి-2 పేరును ఆయన ప్రస్తావించారు. త్వరలోనే దీనిని కార్యాచరణలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. పార్టీకి, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వీరు వారధు లుగా మారాల్సిన అవసరం ఉందన్నారు.
పైకి నేరుగా `కమిటీలు` అని చెప్పకపోయినా.. ఆయన ఉద్దేశం మాత్రం అదే. నిజానికి గతంలోనే చంద్రబాబు జన్మభూమి కమిటీలను తీసుకువచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, ప్రజల నుంచి సమస్యలు ప్రభుత్వానికి తెలిసేలా చేసేందుకు చంద్రబాబు ఈ కమిటీలను వినియోగించుకున్నా రు. పార్టీలో నాలుగో స్థాయి కార్యకర్తలు, నాయకులను ఈ కమిటీల్లో సభ్యులుగా చేర్చారు. పార్టీ కోసం కష్ట పడుతున్నారన్న ఉద్దేశంతో వారికి ఈ అవకాశం కల్పించారు.
అయితే.. ఈ కమిటీలు తర్వాత కాలంలో వివాదంగా మారాయి. ఫలితంగా ప్రజలకు-ప్రబుత్వానికి మధ్య ఉన్న చిన్నపాటి బంధం తెగిపోయింది. దీంతో పార్టీ ఓడిపోయింది. గ్రామీణ స్థాయిలో ఒకానొక దశలో పట్టు కూడా పోయింది. దీంతో జన్మభూమి కమిటీలు అంటేనే బ్యాడ్ నేమ్ వచ్చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల సమయంలోనూ ఈ విషయం చర్చకు వచ్చింది. వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబూ.. నీకు దమ్ముంటే మళ్లీ జన్మభూమి కమిటీలు తీసుకువస్తానని చెప్పు అని సవాల్ విసిరారు.
కానీ, అప్పట్లో మౌనంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు `జన్మభూమి-2` పేరిట మరోసారి కార్యకర్తలను రంగం లోకి దింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే.. ఇప్పుడు చేయాల్సింది.. అప్పట్లో వచ్చిన ఆరోపణలు రాకుండా చూసుకోవడం, పూర్తిస్థాయిలో అధికారాలు కట్టబెట్టకుండా.. నిరంతరం జన్మభూమి కమిటీలపై పర్యవేక్షణ ఉండేలా చూసుకోవడం, అవసరమైతే మార్పులు చేస్తామనే హెచ్చరికలు జారీ చేయడం ద్వారా వీరిని సరైన మార్గంలో నడిపించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే.. ఇబ్బందులు తప్పవు.